నల్లగొండ ప్రతినిధి, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : వంద రోజుల పాలనలో ఒక్కనాడు కూడా వ్యవసాయంపై సమీక్ష చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను శత్రువులా చూస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కరువు పరిస్థితుల్లో ప్రభుత్వపరంగా అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులకు రైతుల గురించి ఆలోచన చేసిన దాఖలాలు లేవన్నారు. కాళేశ్వరంలో వంద టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదని విమర్శించారు. నాగార్జునసాగర్‌లో గతం కంటే ఎక్కువ నీరున్నా దాన్ని ఎలా వాడుకోవాలన్న దానిపై చిత్తశుద్ధి లోపించిందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఉండి ఉంటే ముందస్తు ఆలోచనలతో ప్రత్యామ్నాయ మార్గాల్లో రైతులకు అండగా నిలిచేవారని చెప్పారు. కరువుకుతోడు ప్రభుత్వ బాధ్యతారాహిత్యంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులకు అండగా నిలిచి ధైర్యం చెప్పేందుకు కేసీఆర్ రంగంలోకి దిగుతున్నట్టు తెలిపారు. ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలిస్తూ రైతులతో కేసీఆర్ మమేకం అవుతారని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నల్లగొండలోని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా పాలన కంటే మామూళ్ల వసూళ్లపైనే శ్రద్ధ పెట్టారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ప్రాజెక్టుల గేట్లు ఎత్తకుండా.. పార్టీలో చేరిక కోసం గేట్లు ఎత్తడాన్ని ఆయన దుయ్యబట్టారు. ‘సాగు నీటి కోసం గేట్లు ఎత్తకపోతే ప్రజలే మీ గేట్లు బద్దలు కొట్టి బుద్ధిచెప్పడం ఖాయం’ అని హెచ్చరించారు. కాళేశ్వరం నుంచి నాట్ల సమయంలో నీటిని ఇవ్వడం వల్లే పంటలు సాగుచేశారని, తీరా పొట్టకొచ్చే దశలో నీళ్లు బంద్ చేసి రైతులను ఆగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 టీఎంసీల నీరు ఇచ్చి ఉంటే పంటలు పండేవని, నాగార్జునసాగర్ నుంచి కూడా నీటిని విడుదల చేసే అవకాశాన్ని వదులుకున్నారని మండిపడ్డారు. గతంలో సాగర్‌లో ఇంతకంటే తక్కువ నీరున్నా పంటలను కాపాడిన చరిత్ర కేసీఆర్‌ది అని కొనియాడారు. నీళ్లవ్వకుండా పంటలను ఎండబెట్టి, ఆ పాపమంతా బీఆర్ఎస్దేనని ప్రజలను నమ్మించే కుట్రలో భాగంగా రైతులను బలిపశువులుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు అండగా రంగంలోకి కేసీఆర్
‘రాష్ట్రంలో రైతులకు సాగునీరు లేదు. రైతుబంధు రాలేదు. ధాన్యానికి బోనస్ అందలేదు. వేసిన పంట ఎండుతున్నా పట్టింపులేదు. నష్టపరిహారం ఇద్దామన్న ఆలోచన లేదు. అందుకే కేసీఆర్ రైతులకు అండగా రంగంలోకి దిగుతున్నారు’ అని జగదీశ్‌రెడ్డి తెలిపారు. పదిహేను రోజులుగా జిల్లాలో తాము పర్యటిస్తుంటే వచ్చిన రైతు సమస్యలను కేసీఆర్‌కు వివరించినట్టు చెప్పారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు ఊరట కల్పిస్తూ ధైర్యం చెబుతూ… ప్రభుత్వం కండ్లు తెరిపించేందుకు కేసీఆర్ వస్తున్నారని తెలిపారు. కర్ర సాయంతో కేసీఆర్ నడుస్తున్నా నేడు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలనకు సిద్ధమయ్యారని చెప్పారు. పలుచోట్ల రైతులతో స్వయంగా మాట్లాడి వారికి భరోసా కల్పించనున్నట్టు తెలిపారు. రేవంత్ సర్కార్ అవగాహన లేమి పాలన, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడతామని అన్నారు. బీఆర్ఎస్ మొదటి నుంచి రైతుల పక్షానే ఉంటుందని, నేడు బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా రైతులకు అన్యాయం జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీగా రైతులకు భరోసా ఇవ్వటానికి కేసీఆర్ వస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.