సూర్యాపేటటౌన్, జూన్ 29: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. మీడియా ముసుగులో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌పై మీడియా ముసుగులో ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆదివారం ఆయన సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయలో మీడియాతో మాట్లాడుతూ ఖండించారు. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వాలను హననం చేస్తే.. మీడియా ముసుగులో దాడి చేస్తే కేసీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. ‘మీ దాడులకు మేం ప్రతి దాడులు చేస్తే తట్టుకోలేరు. ఏడాదిన్నర కాలంగా మీడియాను అడ్డం పెట్టుకుని కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. తమను ఇబ్బంది పెట్టే వారెవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. చంద్రబాబు, రేవంత్‌ను చూసి మురుస్తున్న వారిని భవిష్యత్‌లో ఎవరూ కాపాడలేరని పేర్కొన్నారు. పథకం ప్రకారమే బీఆర్ఎస్పై దుర్మార్గానికి పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణాను ఆంధ్రా నుంచి విడదీశారనే అక్కసుతోనే కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
మహాన్యూస్ క్షమాపణ చెప్పాలి..
ఉద్యమం నుంచి వచ్చినోళ్లమని, కేసులకు భయపడబోమని స్పష్టంచేశారు. మహాన్యూస్‌పై దాడి చేశారని ముసలి కన్నీరు కారుస్తున్నారని, కేసీఆర్, కేటీఆర్‌పై అక్కసుతోనే అదే పనిగా దాడులు చేయడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. శనివారం జరిగింది దాడి కాదని, నిరసన మాత్రమేనని, తాము దాడులు మొదలు పెట్టాలని కోరుకోవడం లేదని, తమ సహనానికి పరీక్ష పెట్టవద్దని సూచించారు. మహాన్యూస్ యాజమాన్యం కేసీఆర్, కేటీఆర్‌లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమండ్ చేశారు. సాగునీటి విషయంలో సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి అజ్ఞానులని వ్యాఖ్యానించారు.