హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తేతెలంగాణ): అకారణంగా లగచర్ల రైతులకు బేడీలు వేయించిన ముఖ్యమంత్రి, మంత్రులు.. జైపూర్, ఉదయ్‌పూర్, ఢిల్లీలో విహారయాత్రల్లో మునిగితేలారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చిద్దామంటే ప్రభుత్వం భయపడి పారిపోతున్నదని మండిపడ్డారు. సీట్లో కూర్చున్న తర్వాత నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్, అధికార పక్షానికి వంతపాడుతున్నారని ఆరోపించారు. లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమే ఇందుకు నిదర్శనమన్నారు. సోమవారం ఆయన ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, డాక్టర్ సంజయ్ కల్వకుంట్లతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. రాష్ట్రంలో సమస్యలే లేనట్టు ప్రభుత్వం అసెంబ్లీలో టూరిజంపై చర్చపెట్టడం దుర్మార్గమని విమర్శించారు.
ప్రశ్నిస్తే వాయిదా : ఎమ్మెల్యే వివేకా
బెల్ట్‌షాపుల బెడద నుంచి ప్రజలకు ఎప్పుడు విముక్తి కలిగిస్తారని అసెంబ్లీలో అడిగితే సమాధానం చెప్పకుండా వా యిదా వేయడం విడ్డూరమని ఎమ్మెల్యే వివేకానందగౌడ్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెల్ట్‌షాపులను తొలగించాలని గగ్గోలు పెట్టిన రేవంత్‌రెడ్డి, భ ట్టి విక్రమార్క అధికారంలోకి రాగానే మ రిచిపోయారని మండిపడ్డారు. ప్రభుత్వం గీతవృత్తిని నిర్వీర్యం చేస్తున్నదన్నారు.