ఆత్మకూర్.ఎస్, మే 26 : తెలంగాణలో దొంగలు పడ్డారని, ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని ఇందులో సీఎం, మంత్రులు ఎవరి దోపిడీ వాళ్లదేనని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరు ఐకేపీ సెంటర్లో మొలకెత్తిన వడ్లను సోమవారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. రుతుపవనాలొచ్చి దుక్కి దున్నాల్సిన రైతు ధాన్యం కుప్పల వద్ద కాపలా ఉండాల్సి వస్తున్నదని చెప్పారు. కాంటాలయ్యాక మిల్లుల్లో రైతులతో బేరాలాడుతున్నారని మండిపడ్డారు. రెండు నెలలవుతున్నా ధాన్యం కాంటాలు వేయకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. వడ్లు ముక్కి మొలకలొస్తున్నాయని ఆవేదన చెందారు. ఐకేపీ కేంద్రాల్లో ఫార్‌బాయిల్డ్ వాసనలు వస్తున్నాయని చెప్పారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌చేశారు.
తడిసి తడిసి.. బూజుపట్టి..
ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసి వడ్లు మొలకెత్తి బూజు పడుతున్నాయి. సోమవారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం పార్పెల్లిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం బూజు పట్టడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.- లక్ష్మణచాంద
రైతును ఆదుకునేలా విత్తన చట్టం ; వ్యవసాయశాఖ డైరెక్టర్ బీ గోపి
నూతన విత్తన చట్టం ముసాయిదా రూపకల్పనలో రైతుల అభిప్రాయాలే కీలకమని ముసాయిదా కమిటీ కన్వీనర్, వ్యవసాయశాఖ కమిషనర్ బీ గోపి స్పష్టంచేశారు. సోమవారం బీఆరే భవన్‌లోని రైతు కమిషన్ కార్యాలయంలో విత్తన చట్టం రూపొందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విత్తన చట్టాలపై అధ్యయనం, తెలంగాణ రైతుల సూచనలతో సమగ్ర చట్టం రూపొందించాలని సమావేశంలో కమిటీ సభ్యులు, అధికారులు అభిప్రాయం వ్యక్తంచేశారు. రైతుకు విత్తన హకు కల్పన, నకిలీ విత్తనాలు అరికట్టడం, నకిలీలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చించారు.