సూర్యాపేట, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): పార్టీ మారి పరువు పోగొట్టుకుని, పదవి పోతుందనే భయంతో దింపుడు కల్లం ఆశతో ఫిరాయింపు ఎ మ్మెల్యేలు ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కుంటి సాకులపై ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఇచ్చి న సమాధానంలో పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటని, దీనిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. సీఎం ను కలిసింది నియోజకవర్గ అభివృద్ధి కోసమే అని, రేవంత్ కప్పింది పార్టీ జెం డా కాదు జాతీయ జెండా అని చెప్పడం జాతీయ జెండాను అవమానించడమేనని తెలిపారు. పార్టీ మారకపోతే బీఆర్ఎస్ కార్యాలయానికి ఎందుకు రావడంలేదని, నోటీసులు వచ్చినప్పుడు కేసీఆర్ దగ్గరకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.