సూర్యాపేట : పరిపాలన, వరదల(Floods) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పూర్తిగా విఫలమైందని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లా డుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని విమర్శించారు. రైతు రుణమాఫీ గందరగోళంగా మారింది.
ఇప్పటికి రూ.10 వేల కోట్లు కూడా మాఫీ కాలేదన్నారు. రుణమాఫీ పై స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ విషయంలో రైతులను ప్రభుత్వం మోసం చేస్తున్నది. అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. మళ్ళీ 2014 ముందు లాంటి విద్యుత్ కష్టాలు మొదలైయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన గాలికి వదిలి వ్యక్తిగత సంపాదనలో మంత్రులు పడ్డారు.
పెట్టుబడి సాయం రాక, పంట నష్ట పరిహార సాయం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరదల పై ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేదని విమర్శించారు. ఇంకా బురదలోనే వరద బాధితుల మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు దాడులకు తెగబడుతున్నారు. రూ.2లక్షల కు పైబడి ఉన్న డబ్బు కట్టించుకోకుండానే మాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.