Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మొదటి రోజే ప్రతిపక్షాల గొంతు నొక్కిందని, తాము అధికారంలో ఉనప్పుడు రెండో సభ్యుడు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చామని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకుండా, వివరణలు వినకుండా, కనీసం నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా మొదటిరోజే పారిపోయిందని ఎద్దేవా చేశారు. శనివారం అసెంబ్లీలో, అనంతరం మీడియా పాయింట్లో హరీశ్‌రావు మాట్లాడారు. బీఆర్ఎస్తోపాటు, ఎంఐఎం, బీజేపీ నేతలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా సభను ఏకపక్షంగా వాయిదా వేశారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి సభలో ఎక్కువగా అబద్ధాలే మాట్లాడరని విమర్శించారు. సభలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటామని చెప్పి.. చేతల్లో నిరంకుశత్వాన్ని ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గంటకుపైగా మాట్లాడుతుంటే.. తాము మధ్యలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా స్పీకర్ కనీసం తమవైపు కూడా చూడలేదని, మైక్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌ది ముమ్మాటికీ కుటుంబ నేపథ్యమని హరీశ్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని పేర్కొన్నారు. నాడు పీవీ చనిపోతే కనీసం చూడటానికి కూడా రాలేదని, ఢిల్లీలో ఆయనకు కనీసం గజం జాగా కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. మాజీ సీఎం కేసీఆర్.. పీవీకి ఘనంగా నివాళులు అర్పించారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు ఘాట్ కూడా నిర్మించిందని పేర్కొన్నారు. అమరవీరులను గౌరవించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. సచివాలయానికి ఎదురుగానే అమరవీరుల స్మారకాన్ని అద్భుతంగా నిర్మించామని పేర్కొన్నారు.
రైతుల ఆదాయం విషయంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను, సభను తప్పుదోపట్టించే ప్రయత్నం చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు. నిండు సభలో రైతుల ఆదాయం తక్కువగా ఉందని ఓ తప్పుడు నివేదిక ఇచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మిరపసాగులో తెలంగాణ నంబర్‌గా ఉందని, పత్తిలో 2వ స్థానంలో నిలిచిందని, పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గినట్టు హరీశ్‌రావు చెప్పారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల 2014లో 1348 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు చెప్పారు. రైతుబీమా పొందిన లక్షా 19వేల మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నట్టు, అవి ప్రభుత్వ హత్యలని సభలో చెప్పడం సీఎం రేవంత్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
జీవం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి 2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జీవం పోసిందే కేసీఆర్.. భిక్షపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉట్టిగనే తమకు పదవులిచ్చిందని రేవంత్‌రెడ్డి మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ జీవం పోశారన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి తాము సహకరించామని, ఆ పార్టీకి భిక్ష పెట్టామని వ్యాఖ్యానించారు.
పదవులను తృణప్రాయంగా వదులుకొన్న చరిత్ర కేసీఆర్‌దని హరీశ్ గుర్తు చేశారు. “2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా అధ్యక్షతన యూపీఏ పక్షాల సమావేశం జరిగింది. కేసీఆర్‌ను కేంద్ర మంత్రివర్గంలో చేరాలని సోనియా కోరారు. కామన్ మినిమం పోగ్రాంలో తెలంగాణ అంశాన్ని పెడితేనే క్యాబినెట్లో చేరుతానని కేసీఆర్ అప్పుడు స్పష్టంచేశారు. తాను పదవుల కోసం రాలేదని, తెలంగాణ కోసమే ఢిల్లీకి వచ్చానని కేసీఆర్ చెప్పారు” అని హరీశ్‌రావు గుర్తుచేశారు. తెలంగాణ అంశాన్ని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించి, పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి తన ప్రసంగంలో సంప్రదింపుల ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయిస్తామని చెప్పించింది కేసీఆరేనని గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్‌కు ఇచ్చిన షిప్పింగ్శాఖను తమకు ఇవాలని, లేదంటే యూపీఏ నుంచి వైదొలగుతామని డీఎంకే డిమాండ్ చేస్తే కేసీఆర్ తృణప్రాయంగా ఆ పదవిని వదులుకున్నారని పేర్కొన్నారు.
పదవులను గడ్డి పోచల్లా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే అది ఒక్క కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు. పోతిరెడ్డుపాడు విషయంలోనూ కాంగ్రెస్ అవాస్తవాలు చెబుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఆరుగురం ఆరు కారణాలు చెప్పి 14 నెలలకే రాజీనామా చేశామని తెలిపారు. పోతిరెడ్డిపాడును ఆపాలని అసెంబ్లీలో తాము 45 రోజుల పాటు నిరసన వ్యక్తంచేశామని గుర్తుచేశారు. హరీశ్‌రావు వెంట మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వాకిటి సునీతాలక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విజేయుడు, మాగంటి గోపీనాథ్, లాస్యనందిత, రాజశేఖర్‌రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, బండారు లక్ష్మారెడ్డి, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావ్, వివేకానంద్‌గౌడ్, కోవ లక్ష్మి, అనిల్ జాదవ్ తదితరులు ఉన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు లేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ పేరే రైఫిల్‌రెడ్డి. ఆ నాడు తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని.. జై తెలంగాణ అని ఎవడంటడో రండి. కాల్చిపడేస్తా’ అంటూ ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తమపై ఎన్నో కేసులు నమోదయ్యాయని, ఎన్నికల అఫిడవిట్లలో వాటిని పొందుపర్చామని చెప్పారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇసుక విషయంలోనూ కాంగ్రెస్ అర్థంలేని ఆరోపణలు చేస్తున్నదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. నాడు పదేండ్ల కాంగ్రెస్ హయాంలో రూ.9కోట్లు ఇసుకపై లాభం వస్తే.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.6వేల కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. సభ జరిగిన తీరు దారుణంగా ఉందని, దీనిని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించవద్దని చేతులు జోడించారు.