Harish Rao | సిద్దిపేట, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నంగునూరు : నమ్మిన పాపానికి రైతులను కాంగ్రెస్ నట్టేట ముంచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ‘మద్దతు ధర లేదు..బోనస్ రాదు.. రేవంత్‌రెడ్డి పాలనలో ప్రతి రైతు క్వింటాల్‌కు వెయ్యి రూపాయలు నష్టపోడుతున్నడు’ అంటూ నిప్పులు చెరిగారు. రైతుల ఓట్లు కావాలని గాని, వారు పండించిన వడ్లు మాత్రం వద్దా? అని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తక్షణమే వడ్ల కొనుగోళ్లపై సీఎం సమీక్ష పెట్టాలని, మిల్లులతో టయప్ చేయాలని, క్షేత్రస్థాయికి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు వచ్చి పరిశీలించాలని సూచించారు. ‘సివిల్ సప్లయీస్, వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడున్నరో తెల్వది.. కొనుగోలు కేంద్రాలను సందర్శించరు..రైతుల కష్టాలు చూడరు.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేయాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు.
అభాసుపాలు కాకముందే రైతుల ఆగ్రహానికి గురికాక ముందే కండ్లు తెరవాలని, హైదరాబాద్‌ను విడిచి సీఎం, మంత్రులు వడ్ల మార్కెట్లకు వచ్చి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం బద్దిపడగలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌రావు సందర్శించి రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల బతుకులు గాలిలో దీపంలా తయారయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ కొని రెండు నెలలవుతున్నా ఇంత వరకు రైతులకు పైసలు వేయలేదని చెప్పారు. ప్రభుత్వంపై రైతులకు నమ్మకం పోయిందని, ఈ ముఖ్యమంత్రి పైసలు వేస్తాడో వేయడోనని రైతులు ప్రైవేట్‌కు అమ్ముకుంటున్నారని తెలిపారు.
ఓట్లప్పుడు ఊరూరికి తిరిగితివి కదా? ఇయ్యాల ఎందుకొస్తలేవు? రైతుల ఓట్లు కావాలెగని వాళ్లు పండించిన వడ్లు వద్దా? ఒక్కనాడన్న ధాన్యం మీద రివ్యూ చేసినవా? కొనుగోలు కేంద్రాలంటే ఏంది? రైతుల కష్టాలు ఎట్లుంటయి? అని ముఖ్యమంత్రిగా ఏనాడన్న పట్టించుకున్నవా? కనీసం అధికారులతోనైనా మాట్లాడినవా?
-హరీశ్‌రావు
కొనుగోలు కేంద్రాల్లో రైతులతో మాట్లాడితే దాదాపు 30 శాతానికి పైగా దళారులే వడ్లు కొనుక్కొని పోయారని చెప్పారని, ఈ ప్రభుత్వంలో వడ్లు కొనే దిక్కులేదని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. పొద్దుందాక కోతులు, రాత్రిపూట అడవి పందుల బెడద ఉన్నదని, ఆరుగాలం కష్టపడ్డ పంటకు కనీసం మద్దతు ధర దొరకని దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు రైతుల మద్దతు తనకు కావాలన్న రేవంత్‌రెడ్డి, ఇప్పుడు రైతులకు మద్దతు ఇస్తలేడని విమర్శించారు. వడ్లు కల్లాలకు రాకముందే గన్నీ సంచులు పంపి, రైస్ మిల్లులను అలాట్ చేసి రైతుల వద్ద గింజ కూడా లేకుండా కొనుగోలు చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.
సెంటర్లో దుర్గయ్య అనే రైతును మాట్లాడిస్తే 15 రోజులు అవుతున్నదని, కనకయ్యను పలకరిస్తే నెల రోజులు, భద్రవ్వను అడిగితే పది రోజులైందని చెప్పారని, నెల కింద రైతులు వడ్లు తెచ్చినా ఇప్పటికీ ప్రభుత్వం సంచులు ఇవ్వలేదని, మిల్లులను కేటాయించలేదని మండిపడ్డారు. ఇవ్వాళ రైతులు కొనుగోలు కేంద్రం నుంచి ఇంటికి పోలేని దుస్థితి వచ్చిందన్నారు. వడ్లు కొనకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని, జగిత్యాల, సూర్యాపేట, సిరిసిల్ల జిల్లాల్లో ధర్నాలు చేస్తున్నారని గుర్తుచేశారు.
కేసీఆర్ హయాంలో కరోనా సమయంలోనూ రైతుబంధు ఇచ్చిండు.. ప్రభుత్వానికి ఆదాయం లేకున్నా సమయానికి రైతుబంధు ఇచ్చి రైతులను ఆదుకున్నడు.. 11 విడతల్లో రూ.72,815 కోట్ల రైతుబంధు వేసిండు. కాంగ్రెస్ వస్తే రైతులకు 15 వేలు ఇస్తనన్నవ్.. ఏవీ? ఉన్న రైతుబంధును కూడా ఎగ్గొడితివి..
-హరీశ్‌రావు
రేవంత్‌రెడ్డీ.. వడ్ల కొనుగోలు కేంద్రాలకు రా.. వచ్చి రైతుల కష్టాలు, వారి బాధలు చూడు’ అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా నువ్వు రావు, నీ మంత్రులు రారు. ఇయ్యాళ మీ ప్రభుత్వం రైతులను గోస పుచ్చుకుంటున్నది’ అని మండిపడ్డారు. ‘ఆ రోజు కేసీఆర్ రైతుబంధు రెండు సార్లే ఇస్తాండు.. మేము మూడు సార్లు ఇస్తం అన్న నువ్వు ఇవ్వాళ ఒక్కసారికే ఎగబెట్టినవు’ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ వస్తే రైతులకు ఇస్తామన్న రూ.15 వేలు ఏవీ అంటూ నిలదీశారు.
‘రూ. 500 బోనస్ ఇయ్యవు.. బోనస్ తుస్సుమన్నది.. రైతులను ఎటుకాకుండ చేసినవు. రైతుల ఉసురు పోసుకుంటున్నవు.. మక్కలు కొనే దిక్కులేదు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.. రూ.7,521 పెట్టి కొనాల్సిన పత్తిని 5 వేలకు అమ్ముకుంటున్నరు. వడ్లు కొనక దళారుకు రూ.1800కు అమ్ముకుంటున్నరు. ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణలో రూ. 1800కు వడ్లు కొనుక్కపోతున్నరు. క్వింటాల్ మీద రైతులు మూడు, నాలుగు వందలు నష్టపోతున్నరు’ అని హరీశ్ ధ్వజమెత్తారు. ‘రైతులు పంట పండించాలంటే కష్టపడాలె.. ఇప్పుడు పండించిన పంటను అమ్ముకోవాలన్నా కష్టపడాలెనా? ఇదేనా మీరు రైతులకు చేసే సేవ’ అని నిలదీశారు. రైతులకు ఇచ్చిన మాట ఒక్కటైనా నిలబెట్టుకున్నవా? అని సూటిగా ప్రశ్నించారు.
‘రుణమాఫీ సగం మందికి ఎగబెడితివి.. ఇంక 22 లక్షల మందికి రుణమాఫీ కాలే. 31 రకాల కోతలు పెడితివి. రైతుబంధు ఇయ్యకపోతివి’ అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో కరోనా సమయంలోనూ రైతులకు రైతుబంధు ఇచ్చారని, ప్రభుత్వానికి ఆదాయం లేకున్నా సమయానికి రైతుబంధు ఇచ్చి ఆదుకున్నాడని గుర్తుచేశారు. ‘ఇయ్యాళ లక్షా 50వేల కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తా అంటున్నవ్.. రైతులకు ఇయ్యుమంటే పైసలు లేవ్ అంటున్నవ్.. అన్నం పెట్టే రైతును కాపాడుతవా? మూసీ సుందరీకరణకు పెడుతవా? ఏది నీ మొదటి ప్రాధాన్యత?.. ఓట్ల ముంగిట అన్ని పంటలకు బోనస్ అంటివి.. ఏది నీబోనస్.. ఇయ్యాళ 90 శాతం దొడ్డువడ్లు పండుతయి. 10 శాతం మాత్రమే సన్న వడ్లు పండుతయి.. రైతులను మోసం చేసినవ్’ అని నిప్పులు చెరిగారు.
గత వానకాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని వడ్లు కొన్నది.. ఇప్పడు మీరు ఎన్ని వడ్లు కొన్నారో? చెప్పండి. అప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు బయట పడుతది. కనీసం సంచులు కూడా పంపని చేతకాని ప్రభుత్వమిది. బరువు తక్కువైందని కోతలు పెడుతున్నరు. జాలీలు కూడా సక్కగలేవు. టార్పాలిన్ కవర్లకు దిక్కులేదు. ఏదీ సక్కగ ఇవ్వని చేతగాని ప్రభుత్వమిది.
-హరీశ్‌రావు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఇప్పటికైనా వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల కష్టాలు తెలుసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ‘హైదరాబాద్‌లో కూర్చుండి డైలాగులు కొట్టుడు కాదు.. ఏ ఊరి కల్లానికి వస్తవో రా.. ఒక్క లారీ అన్న పోయిందా? ఇంత వరకు మిల్లులను టయప్ చేయలేదు. రైతులకు మద్దతు ధర రాకుంటే నువ్వు మాట్లాడవా?’ అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. రైతులు కళ్లాల్లోనే పడిగాపులు కాస్తున్నారని, వాళ్లు యాసంగి పనులు చేసుకోవద్దా? అని ప్రశ్నించారు. ఓవైపు అకాల వర్షాలతో చాలాచోట్ల వడ్లు తడిస్తే ఎందుకు కొంటలేరని నిలదీశారు.
కొనుగోలు కేంద్రాల వద్ద కొబ్బరి కాయలు కొట్టుడు ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప వడ్లు మాత్రం కొంటలేరని మండిపడ్డారు. కనీసం వడ్ల కొనుగోలు కేంద్రాలకు కలెక్టర్లు కూడా రావడం లేదన్నారు.సిద్దిపేట జిల్లాలో 3 లక్షల 60 వేల ఎకరాల్లో వానకాలం పంట సాగైందని, దీని ప్రకారం 9 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతాయని, ఇప్పటి వరకు 800 మెట్రిక్ టన్నుల వడ్లే కొన్నారని, ఇప్పటికి కనీసం వెయ్యి మెట్రిక్ టన్నులు కూడా కొనలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 11 విడతల్లో రూ.72,815 కోట్ల రైతుబంధు వేశాడని హరీశ్‌రావు గుర్తుచేశారు. మీడియా సమావేశంలో నాయకులు జాప శ్రీకాంత్‌రెడ్డి, దువ్వల మల్లయ్య, కిష్టారెడ్డి, ఎడ్ల సోంరెడ్డి, లింగంగౌడ్, రమేశ్‌గౌడ్, సారయ్య, భిక్షపతి నాయక్ పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): పేద విద్యార్థులంటే సర్కార్‌కు చిన్నచూపేందుకని హరీశ్ ప్రశ్నించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురుకులానికి చెందిన 60 మంది విద్యార్థులు దవాఖాన పాలైన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. గురుకుల విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారిందని మండిపడ్డారు. అభం..శుభం తెలియని నిరుపేద విద్యార్థులు ప్రజాపాలనలో ఆగం కావలసిందేనా? అని ప్రశ్నించారు. వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థత గురైతే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు.
స్థానికంగా ఉన్న దవాఖానల్లో విడతల వారీగా విద్యార్థులను చేర్చి చేతులు దులుపుకొంటున్నారని విమర్శించారు. ‘వెంటిలేటర్ మీదకు చేరిన ఆ విద్యార్థిని పరిస్థితికి బాధ్యులెవరు? సకాలంలో వైద్యం అందించడంలో ఎందుకు విఫలమయ్యారు?’ అని నిప్పులు చెరిగారు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నా రోజురోజుకూ దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలిపే ప్రయత్నం చేయకపోవటం సిగ్గుచేటని మండిపడ్డారు.
మందల కొద్ది కోతులు వచ్చి వడ్ల మీద పడుతున్నయి.. రాత్రి పూట అడవి పందులు వస్తున్నయి.. వాటి కావలే కాస్తున్నమని రైతులు బాధపడుతున్నరు. ఇయ్యాల కాంగ్రెస్ హయాంలో రైతులకు కల్లాల కాడ కావలి కాసే దుస్థితి వచ్చింది. కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం కొనక నెల రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నమని రైతులు కండ్ల నీళ్లు పెట్టుకుంటున్నరు. ఇదంతా సర్కారుకు కనిపిస్తలేదా?
-హరీశ్‌రావు