మెదక్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయట ప్రశ్నిస్తే పోలీసు కేసులు, అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్లు అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మెదక్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వంలో ఏడో గ్యారెంటీ లేకుండా పోయింది. ఇందిరా పారు దగ్గర ధర్నాలకు అనుమతి లేదు. ఆశ వర్కర్లు నిరసన తెలిపితే పోలీసులతో కొట్టిస్తున్నరు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తే అణచివేసిండ్రు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.2 లక్షల రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులేత్తేసిందని ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డి దేవుళ్లమీద ఒట్టుపెట్టి రైతులను మోసం చేసిండని నిప్పులు చెరిగారు. ‘ అన్ని వర్గాలకు కాంగ్రెస్ దగా చేసింది.
అసెంబ్లీలో మేం అడుగుతుంటే సమాధానం ఇవ్వకుండా ప్రతిదాడులు చేస్తున్నరు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసిండ్రు’ అని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులను రైతులు ఎకడికకడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ‘బడా కాంట్రాక్టర్లకు రూ.14 వేల కోట్ల బిల్లులు ఇస్తున్నరు. రైతుబంధు కోసం ఇవ్వుమంటే డబ్బులుండవు. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులివ్వుమంటే ఉండవు. ఇవాళ 25వ తారీఖు, అంగన్ వాడీలకు జీతాలు పడలేదు. 1వ తారీఖునే జీతాలిస్తామని చెప్తున్నరు.. మాటలే తప్ప చేతలు లేవు’ అని నిప్పులు చెరిగారు. ‘డబ్బుల్లేవంటూనే రూ.20 వేల కోట్లతో హెచ్ఎండీఏలో టెండర్లు ఎలా పిలుస్తున్నరు? రూ.15 వేల కోట్లతో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్స్ టెండర్లు ఎట్లా పిలుస్తున్నరు? రూ.7 వేల కోట్లతో జీహెచ్ఎంసీలో టెండర్లు ఎలా పిలుస్తున్నరు? నీ భూములున్న మీ అత్తగారిల్లు ఆమనగల్‌కు రూ.5 వేల కోట్లతో 10 లైన్ల రోడ్డు ఎట్లా వేస్తున్నవు? ఫ్యూచర్ సిటీ పేరు మీద రూ.5 వేల కోట్లతో రోడ్డు ఎట్లా వేస్తున్నరు? అని ప్రశ్నించారు. సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా సర్కార్‌ను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ప్రజలకు నిరాశే మిగిలింది : సిరికొండ
రాష్ట్రంలో భయంక సమస్యలు వెంటాడుతున్నాయని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి వాపోయారు. తమ జీవితాల్లో మార్పు వస్తుందనుకున్న రైతులు, ప్రజలకు నిరాశే మిగిలిందని చెప్పారు. సాంకేతిక అంశంపై తప్ప సభలో ప్రజల శ్రేయస్సు గురించి అధికార నేతలు ఏమాత్రం ప్రస్తావించడం లేదని తెలిపారు. చట్ట సభల స్థాయిని దిగజార్చిన చరిత్ర ఈ ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తిరుపతిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు జగపతి, మల్లికార్జున్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ కౌన్సిలర్లు ఆంజనేయులు, జయరాజ్, కిశోర్, నాయకులు పాల్గొన్నారు.