Harish Rao | సిద్దిపేట, ఆగస్టు 11: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు విషప్రచారం చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందంటూ విష ప్రచారం చేశారని, మరి ఇప్పుడు కూలిన కాళేశ్వరం నుంచి రంగనాయకసాగర్‌కు నీళ్లు ఎట్లా వచ్చాయని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఆదివారం రంగనాయకసాగర్‌లోకి పంపింగ్ చేస్తున్న గోదావరి జలాలను హరీశ్‌రావు తిలకించారు. సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో 229 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. చెరో ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఈ రెండు పార్టీలు చేసింది గండు సున్నా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎనిమిది సీట్లు ఇచ్చిన తెలంగాణ బీజేపీకి చేదు అయ్యిందని, ఆంధ్ర మాత్రం తీపి అయ్యిందని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలు, అబద్ధ్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను అరిగోస పెడుతున్నదని విమర్శించారు. రైతుబంధు రాక రైతులు, పింఛన్లు రాక అవ్వతాతలు అరిగోస పడుతున్నారని చెప్పారు.
కేసీఆర్ ఆడబిడ్డల పెండ్లికి, కల్యాణలక్ష్మి పేరుతో రూ.లక్ష, ఆడబిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చారని, నేడు కల్యాణలక్ష్మి లేదు, కేసీఆర్ కిట్టు లేదని పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పింఛన్‌ను రూ.200 నుంచి రూ.2000కు పెంచారని, కాంగ్రెస్ ప్రభుత్వం పెంచకపోగా, ఉన్నదే ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో జూన్‌లోనే రైతుల ఖాతాలో రైతుబంధు వేశారని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదని గుర్తుచేశారు. గల్లీగల్లీకి బెల్టుషాపులు పెట్టిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే మద్యంపై ఈ బడ్జెట్లో రూ.7,500 కోట్ల అధిక ఆదాయం టార్గెట్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, నాయకులు జాప శ్రీకాంత్‌రెడ్డి, మారెడ్డి రవీందర్‌రెడ్డి, కడవేర్గు రాజనర్సు, ముల్కల కనుకరాజు పాల్గొన్నారు.