గజ్వేల్, ఏప్రిల్ 13: అన్నీ అబద్ధాలే చెప్తున్న రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని, జాకీలు పెట్టినా లేవలేని స్థితికి కాంగ్రెస్ పార్టీ చేరిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తమ పని అయిపోయిందని చెప్పారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ తక్కువ సమయంలోనే స్పీడ్‌గా పడిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్సే అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. దేవుళ్ల మీద ఒట్టేసి దేశంలోనే మాట తప్పిన ముఖ్యమంత్రి.. రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న యంగ్ ఇండియా స్కూల్స్‌లో రూ.1.5 లక్షల ఫీజు చెల్లించాలని, కానీ, కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వమే ఒక్కో విద్యార్థిపై రూ.1.2 లక్షలు ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యను అందించిందని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో ఉచితంగా విద్యను అందిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి ఫీజులు వసూలు చేస్తున్నదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఓట్ ఫర్ నోట్, చెట్ల నరికివేత, అబద్ధాలు, బూతులు మాట్లాడటం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో బ్రాండ్ అంబాసిడర్ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆయన బ్రాండ్‌ను ప్రజలే నిర్ణయించాలని కోరారు.
సామాన్యుడికో న్యాయం… రేవంత్‌రెడ్డికో న్యాయమా?
సొంత పొలంలో పెంచుకున్న చెట్టును నరికితేనే జరిమానాలు వేస్తారని, అదే రేవంత్‌రెడ్డి మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది ఎకరాల్లో పచ్చని చెట్లను నరికించారని, ఇక్కడ సామాన్యుడికో న్యాయం, రేవంత్‌రెడ్డికో న్యాయమా? అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రామగుండంలో మూడు వేల ఎకరాల్లో, అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాల్లో, హెచ్‌సీయూలో 400 ఎకరాల్లో పచ్చనిచెట్లను నరికితే అధికారులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో మొక్కలు పెంచితే, రేవంత్‌రెడ్డి పాలనలో వాటిని నరికేస్తున్నారని విమర్శించారు. హెచ్సీయూకు సంబంధించిన 400 ఎకరాలను తాకట్టు పెట్ట్టి రూ.10 వేల కోట్లు బాండ్ రూపంలో తెచ్చారని, రూ.170 కోట్లు బ్రోకర్ ఫీజు చెల్లించారని దుయ్యబట్టారు. ‘భూమిని తాకట్టు పెట్టింది నిజం.. అప్పు తెచ్చింది నిజం.. ఇది నిజం కాదని నిరూపిస్తారా?’ అని హరీశ్‌రావు సవాల్ చేశారు. దీనిపై సూటిగా, సీదా సీదాగా దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాదాసు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, రాష్ట్ర నాయకులు దేవీరవీందర్, శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఎల్బీసీ ఘటనపై విచారణ చేపట్టాలి
ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 50 రోజులు దాటినా సహాయక చర్యల్లో పురోగతి లేకపోవడం విచారకరమని హరీశ్‌రావు పేర్కొన్నారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడటంలో రేవంత్ సర్కారు విఫలమైందని ఆదివారం ఎక్స్ వేదికగా విమర్శించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కార్మికులు క్షేమంగా వస్తారని యావత్ దేశం ఎదురుచూస్తుంటే, సర్కారు మాత్రం ఇద్దరి మృతదేహాలను వెలికితీసి చేతులు దులుపుకొన్నదని దుయ్యబట్టారు. ఒక్కసారి ఘటనాస్థలికి వెళ్లొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి కనీసం ఒక్కసారైనా సమీక్ష చేయకుండా నిర్లిప్త వైఖరిని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘హెలిక్యాప్టర్‌లో వెళ్లిన మంత్రులు హడావుడి చేయడమే తప్ప సాధిం చిందేమీలేదు.. వారు పెట్టిన తేదీలు మారాయి తప్ప ఏ ఒక్కరినీ ప్రాణాలతో బయటకు తెచ్చిందిలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటి కోసం, కూలి కోసం తెలంగాణకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలువాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సన్నబియ్యంలో సగం నూకలే
పేదలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో సగానికిపైగా నూకలే ఉన్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. అందులో పాలిష్, ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయని, వండితే అన్నం బుజబుజ అవుతున్నదని, తినే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం గురుకుల పాఠశాలకు నూకలు లేకుండా క్వింటాల్‌కు రూ.350 చొప్పున చెల్లించి ఫైన్‌రైస్ ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా రూ.350 చొప్పున మిల్లర్లకు చెల్లించి కడుపునిండా అన్నం తినేవిధంగా సన్నబియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్.. నూకలు బుక్కండి అంటూ తెలంగాణ ప్రజలను హేళన చేశారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా సన్నబియ్యం పేరుతో పేదలకు నూకలే పంపుతున్నారని మండిపడ్డారు. రెండు విడతలుగా వానకాలంలో రూ.9 వేల కోట్లు, యాసంగిలో రూ.5 వేల కోట్లు కలిపి రేవంత్ సర్కారు రూ.14 వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టిందని విమర్శించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు కానీ, రైతులకు మాత్రం రైతుబంధు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
పండుగలా ఎల్కతుర్తి సభ
పెనుబల్లి, ఏప్రిల్ 13: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహించబోతున్నామని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెంలో ఆదివారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు అధ్యక్షతన రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం సండ్ర మాట్లాడుతూ.. ఈ సభకు భారీ ఎత్తున తరలివెళ్లి సత్తుపల్లి నియోజకవర్గ సత్తాచాటుదామని పిలుపునిచ్చారు. పార్టీ రజతోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
గులాబీ దళం కదం తొక్కాలి ; సాట్స్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్
గద్వాల, ఏప్రిల్ 13 : ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గద్వాల గడ్డ నుంచి పార్టీ శ్రేణు లు, అభిమానులు భారీగా తరలి వెళ్లాలని సాట్స్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం జోగుళాంబ గద్వాలలోని బీఆర్ఎస్ భవన్లో పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రజతోత్సవ వేడుకలను పండుగలా జరుపుకోవాలని సూచించారు. ఆయా గ్రామాలు, వార్డుల్లో బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించి వాహనాల్లో బయలుదేరాలని పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేయాలని కోరారు.