హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోలీసుల దారుణానికి సాక్ష్యంగా నిలిచిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆదివారం ఎక్స్ ఖాతాలో హరీశ్‌రావు ధ్వజమెత్తారు. హెచ్‌సీయూ విద్యార్థులను ఉద్దేశించి ‘గుంట నక్కలు’ అని, ‘క్యాంపస్ సమీపంలో భూ ఆక్రమణను వ్యతిరేకిస్తున్నారు’ అని సీఎం రేవంత్ చేసిన వాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
విద్యార్థుల ఫోన్లు పగులగొట్టి, గొంతులు పిసకడం వంటి చర్యలు చాలా బాధాకరమని వాపోయారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉద్దేశిస్తూ.. ‘2016లో మాదిరిగా.. ఇప్పుడు తమరు నిలబడుతారా? లేక మౌనంగా ఉండిపోతారా..?’ అని నిలదీశారు. అసమ్మతి అనేది నేరం కాదని, విద్యార్థులకు తప్పకుండా న్యాయం జరిగి తీరాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.