సంగారెడ్డి, జూన్ 21(నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి వేధిస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లొంగదీసుకునేందుకు ఈడీ, ఐటీ దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కదలికలపై ఇంటెలిజెన్స్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నదని, ఫోన్లపై నిఘా పెట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు చేసిన నేపథ్యంలో హరీశ్‌రావు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు వచ్చారు.
మహిపాల్‌రెడ్డి సోదరులకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. మహిపాల్‌రెడ్డి ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరించారని తెలిపారు. ఈడీ అధికారులు అణువణువు వెతికినా మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఏమీ దొరకలేదని చెప్పారు. మహిపాల్‌రెడ్డి కుటుంబసభ్యులు ఐటీ రిటర్న్స్ సమర్పిస్తూ బాజాప్తా ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారు తప్ప ఎక్కడా తప్పు చేయలేదని పేర్కొన్నారు. అయినా ఈడీ దాడులు దురదృష్టకరమని పేర్కొన్నారు. కేవలం ప్రతిపక్ష నాయకులపైనే ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. ఈడీ అధికారులు సోదాల సందర్బంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కుటుంబసభ్యలతోపాటు చిన్నారులను కూడా ఇబ్బందిపెట్టడం, వారిని అమ్మానాన్న, తాతయ్య వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
నీట్ పరీక్షా పత్రం లీక్ కావడంతో దేశంలో 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. మన రాష్ట్రం నుంచి లక్ష మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, వారు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని చెప్పారు. నీట్ ప్రశ్నపత్రం రూ.30 లక్షలకు అమ్ముడుపోయిన బీహార్‌లో ఈడీ దాడులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. 24 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటే కేంద్రం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రశ్నాపత్రం లీక్ చేసిన అధికారులు, పరీక్ష పెట్టిన ఎన్టీఏపై ఈడీ, ఐటీ దాడులు ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తున్నదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల కదలికలను ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా, ఫోన్ల ద్వారా మానిటర్ చేస్తున్నారని ఆరోపించారు. ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వినకపోతే అక్రమ కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురిచేయడంతోపాటు కుటుంబసభ్యులను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు.
దక్కిన అధికారంతో ప్రజలకు మేలు చేయకుండా ప్రతిపక్షాన్ని బలహీనపర్చే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైందని విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వినకపోతే కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. తమకు న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉన్నదని, అంతిమంగా న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీనియర్ నాయకులు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.