Madras High Court | సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో వచ్చిన ‘కొచ్చడైయాన్’ సినిమా నిర్మాత మురళీమనోహర్కు మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. పదేళ్ల క్రితం నాటి చెక్ బౌన్స్ కేసులో ఆయనకు గట్టి షాక్ ఇస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ వివాదానికి సంబంధించి బెంగళూరుకు చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు రాబోయే నెల రోజుల్లో రూ.2.5 కోట్లు చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ మొత్తాన్ని చెల్లించని పక్షంలో ఆయన ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.
2014లో భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ సమయంలో మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ డైరెక్టర్ మురళీమనోహర్ ఆర్థిక ఇబ్బందుల వల్ల యాడ్ బ్యూరో సంస్థ నుంచి రుణం తీసుకున్నారు. ఆ అప్పును తిరిగి చెల్లించే క్రమంలో యాడ్ బ్యూరో ఎండీ అబిర్ చంద్ నహర్‌కు రూ.5 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. అయితే, ఖాతాలో తగినంత సొమ్ము లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయింది. దీంతో బాధిత సంస్థ న్యాయపోరాటానికి దిగింది. గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు మురళీమనోహర్ను దోషిగా తేల్చి ఆరు నెలల జైలు శిక్ష విధించగా, ఆయన ఆ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా మద్రాసు హైకోర్టు కూడా దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ, జైలు శిక్ష నుంచి తప్పించుకోవాలంటే వెంటనే బకాయిలో సగభాగాన్ని చెల్లించాలని తుది ఆదేశాలు జారీ చేసింది.