ఆరోగ్యశ్రీ నిధులు అడిగితే బ్లాక్మెయిల్, సొంతంగా కొనుగోలు చేసుకున్న ఐదెకరాల భూమిని అడిగితే ఎస్బీఐకి బ్లాక్మెయిల్, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పీఆర్సీ, పెండింగ్ బకాయిలు అడిగితే బ్లాక్మెయిల్.. మెట్రోను వదిలిపెట్టి పోయేలా ఎల్అండ్టీని బ్లాక్మెయిల్, జర్నలిస్టులు, సోషల్‌మీడియా యాక్టివిస్టులు, ప్రశ్నించే గొంతులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీ బెదిరింపులకు రోజులు దగ్గరపడ్డయ్. ప్రజలు తిరగబడే రోజులు వస్తయ్. – హరీశ్‌రావు
ఖమ్మం, జూన్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వయంగా తన వద్ద ఉన్న విద్య, ము న్సిపల్, హోమ్ శాఖల నిర్వహణలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఢిల్లీకి మూటలు మోసి తన కుర్చీని కాపాడుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఈ రెండున్నరేండ్లలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిస్థాయిలో ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. ఫీజుల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, కనీస పారిశుధ్య నిర్వహణ.. ఇలా అన్నింటా సీఎం రేవంత్‌రెడ్డి ఘో రంగా విఫలమయ్యారు. నమ్మి ఓటేసిన ప్రతి వర్గాన్నీ మోసం చేయడంలో మాత్రం రేవంత్ విజయం సాధించారని ఎద్దేవా చేశారు. ఎస్ఐఆర్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యకర్తల అవగాహన సదస్సులో హరీశ్‌రావు ప్రసంగించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోమని.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక.. వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ కార్యకర్తలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, అర్హుల ఓట్లను తొలగించకుండా చూడాలని సూచించారు.
ఏం ముఖం పెట్టుకొని ఆశీర్వాద సభ?
నిరుడు ఆగస్టులో రైతులందరికీ రైతుభరోసా వేస్తామని అందరి దేవుండ్ల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పటివరకు మూడు సార్లు పంటల పెట్టుబడికి ఎగనామం పెట్టారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రైతుభరోసా, రుణమాఫీ, పంటల బీమా ఎగ్గొట్టిన ప్రభుత్వం.. ఆ సభను ‘రైతు ఆశీర్వాద సభ’ అని కాకుండా ‘రైతు క్షమాపణ సభ’గా పేరు మార్చుకొని రైతులను క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో తొలివర్షం పడిన రోజే రైతుబంధు వేశామని గుర్తుచేశారు.
స్కాముల సర్కార్ పోవాలి..
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని హరీశ్‌రావు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభు త్వం ప్రజల సంక్షేమం కోసం అనేక స్కీములను అమలుచేసిందని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్నీ స్కాములే చేస్తున్నదని దుయ్యబట్టారు. అందుకే ఈ స్కాముల ప్రభుత్వం పోయి స్కీముల ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
రఘునాథపాలెం బాధితులకు అండగా ఉంటం
ఇందిరమ్మ రాజ్యం అని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. క్రూరమైన హిట్లర్ రాజ్యాన్ని నడుపుతున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. పేదల ఇండ్లు, గుడిసెలను కూల్చడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. మంగళవారం ఖమ్మంలోని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇంటి వద్ద రఘునాథపాలెం మండల పరిధి 218 సర్వే నంబర్లో ఇండ్ల స్థలాలు కోల్పోయిన బాధితులతో మాట్లాడారు. ఇండ్ల స్థలాలు కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పే రుతో పేదల స్థలాలను లాక్కొని దిక్కులేని వా రిని చేయడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్ టీఎస్ దివాకరతో ఫోన్లో మాట్లాడి పేదలకు అన్యాయం జరుగకుండా చూడాలని కోరారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
ఖమ్మం జర్నలిస్టులకు తక్షణమే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశా రు. కేసీఆర్ హయాంలో జీవో ఇచ్చి లే అవుట్ తయారుచేశారని గుర్తుచేశారు. కానీ, ఆ స్థలానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే తామే వారికి పొజిషన్ ఇప్పిస్తామని తేల్చిచెప్పారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పార్టీ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, తాటి వెంకటేశ్వర్లు, జడ్పీ మాజీ చైర్మన్ లిం గాల కమల్‌రాజు, నాయకులు రాకేశ్‌రెడ్డి, వేణు, జోగేశ్వరరావు, శ్రీనివాస్, వీరభద్రం, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి ఉ ప్పల వెంకటరమణ, నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, షేక్ షకీనా పాల్గొన్నారు.
కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క పుణ్యమా అని సింగరేణి సంస్థ అప్పుల్లో పూర్తిగా కూరుకుపోయిందని, చివరికి బ్యాంకుల వద్దకు ఓడీ కోసం తిరుగాల్సిన దుస్థితి దాపురించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. నాడు సిరుల గనిగా ఉన్న సింగరేణి కాంగ్రెస్ హ యాంలో ఇవాళ కుంభకోణాల ఖనిగా మారిందని విమర్శించారు. సింగరేణిలో దోపిడీని అరికట్టాలంటే కార్మికులు పోరాటానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్లో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, కాపు కృష్ణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సింగరేణి పరిరక్షణ సభలో ఆయన మాట్లాడారు. నాడు ప్రతి టెండర్లో మైనస్ కోట్ చేస్తే ఇ ప్పుడు ఎక్సెస్ కోడ్‌తో టెండర్లను దక్కించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణి చరిత్రలోనే తొలిసారి ఎక్సెస్ టెండర్లను దక్కించుకున్నది సీఎం బావమరిదేనని ఆ రోపించారు. అందుకే బొగ్గు లేకున్నా రికార్డుల్లో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ధ్వ జమెత్తారు. మాయమైన రూ.1,600 కోట్ల విలువైన బొగ్గుపై సీఎం రేవంత్, భట్టి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్‌లో టెండర్లను ఏడు సార్లు ఎందుకు వాయిదా వేశారో చెప్పాలన్నారు. ఎన్టీపీసీ లో పవర్ ఉండగా కొత్తగా సోలార్ ప్రాజెక్టు లు ఎందుకని ప్రశ్నించారు. బొగ్గు నిల్వలు గురించి మాట్లాడుతున్న కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అవి ఎక్కడున్నాయో చూపెట్టాలని డిమాండ్ చేశారు. కా ర్మికుల పక్షాన ఉండాల్సింది పోయి కాంగ్రెస్‌తో జతకట్టి అన్యాయం చేస్తే వాళ్లే బుద్ధి చెప్తారన్నారు. సదస్సులో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మె ల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధుసూదన్, మాజీ విప్ రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్, దిండిగల రాజేందర్, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
దండుపాళ్యం బ్యాచ్ దోపిడీ: మాజీ మంత్రి పువ్వాడ అజయ్
రాష్ట్రంలో దండుపాళ్యం బ్యాచ్ దోపిడీ సాగుతున్నది. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలు గోసపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు తీసుకురావాలని గత కేసీఆర్ సర్కార్ సీతారామ ప్రాజెక్టును 80శాతం పూర్తి చేస్తే,.. మిగతా పనులను కూడా ఈ దద్దమ్మ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. బుగ్గపాడు ఫుడ్‌పార్కులో మంత్రి తుమ్మల భూదందాకు పాల్పడ్డారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యం: వద్దిరాజు రవిచంద్ర
ఈ రెండున్నరేండ్ల లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెరిగింది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి 10కి 10 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. సీఎం రేవంత్‌రెడ్డికి అక్రమ కేసులు బనాయించడం తప్ప పాలన చేతకాదు. ఎస్ఐఆర్లో మన ఓటు పోకుండా, దొంగ ఓట్లు లేకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ క్యాడర్‌పై ఉన్నది.
బీఆర్ఎస్ వైపే ప్రజల చూపు: తక్కెళ్లపల్లి
ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు ప్రజల చూపంతా బీఆర్ఎస్పైనే ఉన్నది. జిల్లాలోని ముగ్గురు మంత్రులూ మోసగాళ్లుగా తయారయ్యారు. ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వమే శ్రీరామరక్ష. సభ్యత్వ నమోదుపై శ్రేణులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
కాంగ్రెస్ పాలన అట్టర్‌ఫ్లాప్: తాతా మధు
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అట్టర్‌ఫ్లాప్. హామీలను గాలికొదిలేసి, ప్రజల సంక్షేమాన్ని రేవంత్‌రెడ్డి విస్మరించారు. దోపిడీలు, కబ్జాలు, కమీషన్లు తప్ప మంత్రులకు ప్రజాపాలన పట్టడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి స్కామ్‌లోనూ మంత్రుల భాగస్వామ్యమే ఉంటున్నది.