నల్లగొండ, డిసెంబర్ 8 : బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సారథ్యంలో చేపట్టిన పనులకే ప్రారంభోత్సవాలు చేసి, తామే చేసినట్టు కాంగ్రెస్ నాయకులు గొప్పులు చెబుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. దామరచర్లలో ప్రారంభం చేసిన యాదాద్రి పవర్‌ప్లాంట్, నల్లగొండలో ప్రారంభించిన వైద్య కళాశాల బీఆర్ఎస్ సర్కార్ నిధులతో చేపట్టినవేనని స్పష్టంచేశారు. నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాది కాలంలో రేవంత్‌రెడ్డి ఈ జిల్లాకు ఇచ్చిన నిధులేమిటో చెప్పాలని ప్రశ్నించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు 7500 మెగావాట్ల విద్యుత్తు తెలంగాణలో ఉంటే 2027 నాటికి 24 వేల మెగావాట్లు కావాలనే ఆలోచనతో దామరచర్లలో 4 వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తే అందులో 800 మెగావాట్లు అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఇది కేసీఆర్ ముందుచూపే కారణమని, ఇందులో కాంగ్రెస్ చేసిందేమీ లేదని చెప్పారు.
చేసిన ప్రాజెక్టుకే మరోసారి ట్రయల్ రన్
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ట్రయల్ రన్ గత మే నెలలోనే చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యే హోదాలో చేస్తే దాన్ని మళ్లీ సీఎం రేవంత్‌తో ట్రయల్ రన్ చేయించడం హాస్యాస్పదంగా ఉన్నదని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. తాము శంకుస్థాపన చేసిన పనులు తమ హయాంలోనే 90 శాతం పూర్తి కాగా, వాటిని ఇప్పుడు ప్రారంభించి తమ ప్రాజెక్టులు అని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. మూసీ ప్రక్షాళనను ప్రారంభించిందే తామని తెలిపారు.
ఇద్దరు మంత్రుల మోసాలు బయటపెడతా
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క శంకుస్థాపన కూడా చేయకుండా సొంత లాభం కోసం ఇద్దరు మంత్రులు పని చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. నిత్యం మోసాలతో పాలన చేస్తున్న ఇద్దరు మంత్రులు ఎవరి దగ్గర ఏం తీసుకున్నారో? వారిని ఎలా మోసం చేస్తున్నారో? చిట్టా మొత్తం తన దగ్గర ఉన్నదని, త్వరలోనే వారి మోసాలు బయట పెడుతామని మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ను దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేశారు. ‘జిల్లాలో త్వరలో మీ బాధిత సంఘాలు ఏర్పాటు అవుతాయి. ఇక మీ మోసాలు బయటపడే సమయం వచ్చింది’ అన్నారు. సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్ తదితరులు పాల్గొన్నారు.