కరీంనగర్ : కరీంనగర్(Karimnagar) చరిత్రలో లేని విధంగా వరుసగా నాలుగుసార్లు గెలిపించిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానని, నా చివరి క్షణం వరకూ ప్రజల కోసమే పని చేస్తానని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula) అన్నారు. కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పదిహేను సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కరీంనగర్ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేశానని తెలిపారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుండి..వ్యవసాయం పండగ అనే పరిస్థితికి తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వం ప్రజల పక్షం ఉండాలని.. జవాబుదారీగా పని చేయాలని..ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే పోరాడతామని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల వరకు ఎదురు చూస్తామని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నిరసన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పోరాటాలు బీఆర్ఎస్ కు కొత్తేమీ కాదని, మేము రొడ్డేక్కే పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోవద్దని హితవు పలికారు.ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని, అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. ప్రజా సమస్య ల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్టల కరుణ రవీందర్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సాబీర్ పాషా, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.