జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రజల స్థితిగతుల్లో గణనీయమైన మార్పు వచ్చిందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Mla Venkata ramana reddy) అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి రోల్‌మోడల్(Role model)గా నిలిచిందని పేర్కొన్నారు. ఆదివారం భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్(BRS) అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
భూపాలపల్లి నియోజకవర్గం మున్సిపాలిటీ తొమ్మిదేళ్లలో అన్నింటా అభివృద్ధి సాధించడానికి సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) , ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు(Minister Harish Rao)కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల మంత్రి కేటీఆర్ భూపాలపల్లిలో పర్యటించిన సందర్భంగా భూపాల్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ .50 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరగా, మొదటి విడతగా రూ .30 కోట్ల నిధులను మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారని అన్నారు.
ఈ నిధులతో భూపాలపల్లి మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు సుందరీకరణ పనుల కోసం రూ .4 కోట్ల సీఎస్ఆర్ నిధులు మంజూరు అయ్యాయని ఈ పనులు త్వరలో చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కేంద్రంలో నిర్మితమవుతున్న సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయము నిర్మాణ పనులు ఆగస్టు నెల నాటికి పూర్తవుతాయని, ఈ భవనాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకొనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు .
విపక్షాల ప్రచారం అవాస్తవం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి కార్మిక నివాసార్థం నిర్మించిన 994 డబుల్ బెడ్ రూమ్ క్వార్టర్లు పారదర్శకంగా అన్ని కార్మికులకే కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కార్మికేతరులకు క్వార్టర్లు కేటాయిస్తారని విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. జూన్ 2 నుంచి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.