హైదరాబాద్ : గుజరాత్ తడీపార్ ‘చెప్పు’ చేతల్లో తామున్నామని బండి సంజయ్ నిరూపించి.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని ఎమ్మెల్యే గాదరి కిశోర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడులో ముమ్మాటికి గెలిచేది టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్నారు. దేశమంతా మునుగోడువైపు చూస్తుందని, మునుగోడు బీజేపీని రాష్ట్రంలో అడ్రస్‌లేకుండా చేస్తుందని ఆయన చెప్పారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే రాజగోపాల్‌రెడ్డి ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు.
తన స్వార్థం కోసం ఎన్నికలు తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల వైపు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారని, కేసీఆర్ దృష్టిని రాష్ట్రం మీదే కేంద్రీకరించేందుకే బీజేపీ కుట్ర చేసి రాజగోపాల్రెడ్డిచేత రాజీనామా చేయించిందని పేర్కొన్నారు. మునుగోడు సభలో అమిత్‌షా చెప్పినవన్నీ అబద్ధాలేనని, నల్గొండలో ఇప్పటికే రెండు మెడికల్ కాలేజీలు అద్భుతంగా కొనసాగుతున్నాయని, మూడో కాలేజీ ఇటీవలే మంజూరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో నిరంతరంగా వస్తున్న కరెంట్‌ను రానీయకుండా చేసే కుట్రల్లో భాగంగానే మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారని ఆరోపించారు.
భావోద్వేగాలతో రాజకీయాలు చేయాలని బీజేపీ చేస్తుందని, అందులో భాగంగానే అమిత్‌షా సెప్టెంబర్ 17ను మళ్లీ తెరమీదికి తెచ్చారని ధ్వజమెత్తారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి, అమిత్‌షాకు ఎంతమాత్రం లేదని, 22 కేంద్రమంత్రులు దళితులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డవారేనని, వారిపై కేసులు సైతం నమోదు అయ్యాయన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఎప్పుడూ తమ మేనిఫెస్టోలో దళితుడిని సీఎం చేస్తామని పెట్టలేదన్నారు.
అమిత్ షా అండ్ కో ఎన్ని వేషాలు వేసినా గెలిచేది టీఆర్ఎస్సేనని, రెండోస్థానం కోసమే బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీపడుతున్నాయని చెప్పారు. ఎమ్మల్సీ కవిత నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారిణి అని ఆయన పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవనీ ఆమే తేల్చిచెప్పారని ఆయన గుర్తుచేశారు. ఆమె మీద కావాలనే ఆరోపణలు చేస్తూ బీజేపీ శిఖండి రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలపై పరువు నష్టం దావా నష్టం వేస్తానని పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.