హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): తాను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని తెలుపుతూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపు మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన పిటిషన్‌పై విచారణకు రావాలని కోరుతూ స్పీకర్ నోటీసు పంపిన నేపథ్యంలో దానం ఈ లేఖ రాసినట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తనకు వ్యక్తిగత సమాచారం లేదని, తాను ఆ పార్టీకి రాజీనామా చేయలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. 2024 మార్చిలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్లానని, వ్యక్తిగత హోదాలో మాత్రమే ఆ భేటీకి హాజరయ్యానని తెలిపారు.
మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్టు బీఆర్ఎస్ భావిస్తున్నదని వివరించారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్‌లోని అంశాలపై మాత్రమే వివరణ ఇస్తున్నానని పేర్కొన్నారు. గతంలో కోర్టు తీర్పులను అనుసరించి బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ చెల్లుబాటు కాదని తెలిపారు. అనర్హత పిటిషన్ తర్వాతి పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరించవద్దని విజ్ఞప్తిచేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని పరోక్షంగా స్పీకర్‌ను కోరారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారన్న పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై ఎంపీగా పోటీ చేయడం తెలిసిందే.
30న దానం విచారణ
బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవారం నోటీసులు జారీచేశారు. నాగేందర్ అనర్హత పిటిషన్‌పై ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. దానంపై అనర్హత వేటువేయాలని కోరుతూ పిటిషన్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని కూడా 30న జరిగే విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు పంపారు. కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని ఆరోపిస్తూ.. వారిపై స్పీకర్ అనర్హత వేటువేయడంలో జాప్యం చేస్తున్నారంటూ.. బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ నెల 19న స్పీకర్‌కు కోర్టు ధికర నోటీసులు జారీచేసింది. ఎమ్మెల్యేల పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది.