నల్లగొండ : ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఘరానా మోసంతో నార్కట్‌పల్లిలో చిక్కుకుపోయిన అస్సోం, బీహార్ రాష్ట్రాలకు చెందిన 64 మంది వలస కూలీలకు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అండగా నిలిచారు. కేరళ నుంచి అస్సోం, బీహార్ రాష్ట్రాలకు బయలుదేరిన వలస కూలీలు ప్రయివేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు డ్రైవర్ ఘరానా మోసంతో నార్కట్ పల్లిలో చిక్కుకుపోయారు.
కేరళ నుంచి బస్సులో ప్రయాణిస్తున్న వారిని నార్కట్ పల్లి సమీపంలో ఓ హోటల్ వద్ద అకారణంగా దించేశారు. బస్సు రిపేర్ చేయించుకొస్తామని నమ్మించి అందర్నీ హోటల్ వద్ద వదిలేశారు. తరవాత అడ్రెస్ లేకుండా చెక్కేసారు. ఎంత సేపు వేచి చూసినా బస్సు తిరిగి రాకపోవడంతో ప్రయాణికులంతా కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్థానిక ఎస్ఐతో మాట్లాడి వారికి రాత్రి బస ఏర్పాటు చేయించారు. ఈ రోజు ఉదయం వారిని పట్టణ కేంద్రంలోని జి.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్లో పరామర్శించారు. సంఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. డ్రైవర్ మోసం చేసిన తీరుపై విచారం వ్యక్తం చేసి, ప్రయాణికులకు ధైర్యం కల్పించారు.
వారికి ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయించి, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను సిద్ధం చేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. అలాగే బాధితులంతా తమ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేలా అవసరమైన రవాణా ఏర్పాట్లను చేయించి భాదితులకు అండగా నిలిచారు. ఎమ్మెల్యే చిరుమర్తి ఔదార్యానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.