Yadadri | యాదగిరిగుట్ట : శ్రావణ మాసం మొదటి ఆదివారంతోపాటు స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య చేతుల మీదుగా స్నాన సంకల్పానికి శ్రీకారం చుట్టి అఖండ దీపారాధన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రంలో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక గిరిప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ప్రధానాలయంతోపాటు అనుబంధ పాతగుట్ట (పూర్వగిరి) ఆలయంలో ఆదివారం స్వాతినక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసం తొలి ఆదివారం సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరు మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, శివాలయం, శ్రీవారి మెట్ల మార్గం భక్తులతో సందడిగా మారాయి.