యాదగిరిగుట్ట, మార్చి17 : భర్త తరఫున తమకు సంక్రమించాల్సిన భూమిని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మేన బావమరిది ఎర్ర అయిలయ్య, ఆయన అనుచరులు కబ్జా చేసి తమను ఇబ్బంది పెడుతున్నారని యాదాద్రి భువనగిరి జల్లా రాజాపేట మండలం రఘునాథఫురం గ్రామానికి చెందిన మహిళా రైతు మిర్యాల పద్మ వాపోయింది. తన కుమారుడు మిర్యాల ప్రశాంత్‌తో కలిసి సోమవారం యాదగిరిగుట్ట బీఆర్ఎస్ కార్యాలయం లో మీడియా ఎదుట గోడును వెల్లబోసుకున్నది. వివరాలు ఆమె మాటల్లోనే.. రఘునాథఫురం గ్రామానికి చెందిన మి ర్యాల నర్సయ్యకు తన(మిర్యాల పద్మ)తోపాటు మరో భార్య మిర్యాల సత్తమ్మ ఉంది. తన పేరిట 1.13 ఎకరాలు, మిర్యాల సత్తమ్మ పేరిట 1.13 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. 2022 ఏప్రిల్ 7న నర్సయ్య పక్షవాతంతో చనిపోయాడు.
నర్సయ్య పేరిట రాజాపేట మండలం పొట్టిమర్రి వద్ద సర్వేనంబర్ 347/ఈలో 2.27 ఎకరాలు, 347/లో 1.21 ఎకరాలు ఉంది. ఇందులో మిర్యా ల సత్తమ్మ పేరిట 347/ఈలో 2.27 ఎకరాల భూమిని అక్రమంగా ఫౌతీ చేశారు. హక్కుగా రావాల్సిన భూమిని సత్తమ్మ అక్రమంగా చేయించుకుందని హైకోర్టులో పిల్ వేయగా ఫౌతీని నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. హైకో ర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఎకరం భూమి 2023లో ఆకుల నర్సింహులు కొనుగోలు చేసి, ఏడాదిలోపే మల్లాపురం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మేనబావమరిది ఎర్ర అయిలయ్యకు రిజిస్ట్రేషన్ చేశారు.
2024 సెప్టెంబర్‌లో నర్సాపురం గ్రామానికి చెందిన పిట్టల ప్రభాకర్ పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వారంతా ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసుకుని 347/ఈ లో 2.27 ఎకరాలు, 347/లో 1.21 ఎకరాలను కలిపి మొత్తం 4.08 ఎకరాలు కబ్జా చేశారు. దీనిపై బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసులు, ఎర్ర అయిలయ్య అనుచరులైన పిట్టల ప్రభాకర్, ఉదయ్‌రెడ్డి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు’ అని మిర్యాల పద్మ ఆవేదన వ్యక్తం చేసింది.