మహబూబ్‌నగర్, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి రాజకీయంగా బరితెగించారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడలేదని స్పీకర్ తీర్పు చెప్పినా.. మరో వైపు తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని అబద్ధాలు చెప్తూనే శుక్రవారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థులు, జోగుళాంబ గద్వాల డీసీ సీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డితో కలిసి అధికార పార్టీ జెండాలతో జిల్లా కేంద్రంలో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పాత బస్‌స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన రోడ్‌షోలో నిస్సిగ్గుగా గద్వాల మున్సిపాలిటీ బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. స్పీకర్ నిర్ణయాన్ని ఎమ్మెల్యే అపహాస్యం చేశారని స్థా నికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గద్వాల డీసీసీ అధ్యక్షులతో కలిసి బరి తెగించి ప్రజల మధ్య నడిబజారులో నిలబడి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు, స్పీకర్‌ను తప్పుదోవ పట్టించి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో గద్వాలలో ఒకే బంగ్లాలో కాంగ్రెస్, బీజేపీ బందీ అయ్యాయన్న విషయం అర్థమవుతున్నది.
బీఫాంలన్నీ హస్తగతం
ఓ వైపు తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని ఎమ్మెల్యే బండ్ల చిలుక పలుకులు పలుకుతూ.. మరోవైపు మున్సిపల్ ఎన్నికల బీఫాంలన్నీ హ స్తగతం చేసుకున్నట్టు తెలిసింది. దీంతో అసలైన కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే ద్రోహం చేసినట్లయింది. ఎమ్మెల్యే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తన అభ్యర్థులను కాంగ్రెస్ బీఫాంలతో ఎలా నిలబెట్టారనేది అంతు చిక్కని ప్రశ్న. బీ ఫాంల విషయంలో ఎమ్మెల్యే తీరు ‘మొగుడి సొమ్ము తింటూ.. ఎవరి పాటో పాడినట్టు’.. అన్న చందంగా తయారైంది. మున్సిపల్ ఎన్నికల్లో తన అబద్ధాలతో ఎమ్మెల్యే మరోసారి పట్టణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలిసిపోతున్నది.
బీఫాంల విషయంలో సరితకు రిక్తహస్తం
‘గద్వాలలో అసలైన కాంగ్రెస్ వాళ్లం మేమే.. అధిష్టానం బీఫాంలు మాకే ఇస్తుం ది’.. అని మొదటి నుంచి జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గీయులకు బలమైన నమ్మకం ఉండేది. అధిష్టానం బీఫాంలన్నీ ఎమ్మెల్యే వర్గీయులకు ఇవ్వడంతో సరిత వర్గంలో నైరాశ్యం నెలకొన్నది. పార్టీ కోసం కష్టపడి.. పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలను నట్టేట ముంచడంతో వా రికి ఏం చేయాలో పాలుపోవడంలేదు. నిజమైన కార్యకర్తలకు కాంగ్రెస్‌లో విలువ లేదనేది బీఫాంల విషయంలో అధిష్టానం నిర్ణయంతో తేటతెల్లమవుతున్నది. దీంతో సరిత వర్గానికి చెందిన 200 మంది కాంగ్రెస్ నాయకులు గద్వాలలో బీఆర్ఎస్ సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ ఆధ్వర్యంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే నంటూ..కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని..
తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని ఓ వైపు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థుల నామిషన్ల అనంతరం పాతబస్స్టాండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. వార్డుల్లో అభివృద్ధి జరగాలంటే హస్తం గుర్తుకు ఓటేసి అభ్యర్థులను గెలిపించాలని వేడుకున్నారు. ‘దున్నపోతుకు గడ్డి వేసి.. ఆవుకు పాలు పిండాలంటే సాధ్యం కాదు’.. అన్న చందంగా పరిస్థితి తయారైంది. ఎవరికో ఓటు వేస్తే వార్డులు అభివృద్ధి జరుగవన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేస్తేనే గద్వాల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి పేదలకు ఆరు గ్యారెంటీలు అమలుచేయడం జరుగుతుందన్నారు.