హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ నేతలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. అడ్డుకోవడమే మీ పని అయితే కిషన్ రెడ్డి తెలంగాణలో తిరగలేడు. బండి సంజయ్ పాదయాత్ర చేయలేడని హెచ్చరించారు. బీజేపీ నేతలది ఓర్వలేని తనమని మండిపడ్డారు. బండి సంజయ్‌ది పాదయాత్ర కాదు.. పాపాలను కడుక్కునే యాత్ర అని విమర్శించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. మోదీ అసమర్థత వల్ల దేశంలో కరెంట్ కోతలు ఏర్పడ్డాయన్నారు.
జగ్గారెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జగ్గారెడ్డి ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులకు జగ్గారెడ్డి కొమ్ము కాశారని ధ్వజమెత్తారు. ఉద్యమపార్టీకి ద్రోహం చేసిన చరిత్ర జగ్గారెడ్డిది అని సుమన్ నిప్పులు చెరిగారు. జగ్గారెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు.
ఓయూకు వచ్చే ముందు తెలంగాణ ప్రజలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు రాహుల్ పర్యటన అని పేర్కొన్నారు. తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చి చేసేదేమీ లేదని చెప్పారు. సొంత రాష్ట్రంలో రాహుల్ తన పార్టీని గెలిపించుకోలేదని సుమన్ ధ్వజమెత్తారు.