ఆదిలాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధికారులకు సూచించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు శనివారం గురుకుల పాఠశాలలను సందర్శించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేరడిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వంట గదిని పరిశీంచారు. మెరుగైన భోజనం అందించాలని ఉపాధ్యాయలకు సూచించారు. జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉండటంతో విద్యార్థినులు ఇబ్బందులు పడకుండా సొంత డబ్బులతో దుప్పట్లు కొనుగోలు చేసి పంపిణీ చేశారు. పిల్లలకు మంచి విద్యను అందించాలని, అనారోగ్యానికి గురైతే దవాఖానకు తీసుకెళ్లి మంచి వైద్యం అందించాలని సూచించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా నియోజకవర్గంలో 3వేల మందికి సొంత డబ్బులతో దుప్పట్లు పంపిణీ చేయనున్నట్టు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు.