తలమడుగు, ఆగస్టు 19 : వరదల నేపథ్యంలో రైతులు, ముంపు బాధితులను పరామర్శించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పర్యటించాల్సి ఉన్నది. ఆయన కోసం రాత్రి వరకు వేచి చూసినా రాకపోవడంతో రైతులు, ముంపు బాధితులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. మంత్రి మంగళవారం ఉదయం వస్తారని అధికారులు ప్రకటించగా, వర్షానికి దెబ్బతిన్న పంటల వద్ద రైతులు ఉదయం నుంచి రాత్రి వరకు వేచి చూశారు. రాత్రి 8 గంటలైనా మంత్రి రాకపోవడంతో తమ ఇండ్లలోకి వెళ్దామనుకుంటున్న సమయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వచ్చారు. ఎమ్మెల్యే పొలాలకు వెళ్లి నష్టపోయిన పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు ఉండటంతో నీళ్లు వస్తున్నాయని, కల్వర్టులు నిర్మించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాత్రి వరకు ఆయా గ్రామాల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బైక్పై పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే ; మారుమూల గ్రామాల్లో పర్యటించిన అనిల్ జాదవ్
భీంపూర్, ఆగస్టు 19 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. మంగళవారం ఉదయం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అటవీ ప్రాంతం గుండా రాళ్లు, రప్పలు తేలిన రహదారిపై నుంచి బైక్పై వెళ్లి చేలను పరిశీలించారు. కాలినడకన 60 చేలల్లో దెబ్బతిన్న పంటలను చూశారు. వంతెనలు, వాగులను పరిశీలించి పరిస్థితిని తెలుసుకున్నారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.