హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా హామీలు అమలు చేయడం లేదని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదట డిసెంబర్ 9న అమలు చేస్తామన్నారని, తర్వాత వందరోజుల సమయం అడిగారని, ఇప్పుడు ఆరునెలలు కూడా దాటిపోయాయని గుర్తుచేశారు. అయినా హామీలు అమలుకు నోచుకోవడం లేదని ధ్వజమెత్తారు. చివరికి సామాజిక పింఛన్ల పెంపు హామీని కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలిరోజే పింఛన్లు పెంచారని, వాళ్లను చూ సైనా నేర్చుకోవాలని సూచించారు. తెలుగు పుస్తకం ముందుమాటలో గత సీఎం, విద్యాశాఖమంత్రి పేర్లు ఉండటం తో దాదాపు 20 లక్షల పుస్తకాలపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను తప్పుబట్టారు. ఆశవరర్ల సమస్యలను వెంటనే పరిషరించాలని డిమాండ్ చేశారు.