హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎంఐఎం శానస సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అసెంబ్లీ వేదికగా కడిగి పారేశారు. విద్యార్థుల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడుతామని అసెంబ్లీ జీరో అవర్లో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో దశలవారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతు ఆత్మహత్యల కన్నా విద్యార్థుల ఆత్మహత్యలు మూడురెట్లు అధికంగా ఉన్నాయని అక్బరుద్దీన్, వాణీదేవి మండిపడ్డారు. ‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే ఎనిమిది వేల కోట్లున్నాయని, 20 లక్షల మంది విద్యార్థులు, ఇబ్బందులు పడుతున్నారని, 4 లక్షల మంది ఫ్యాకల్టీకి జీతాలు అందడం లేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
రాష్ట్ర విభజన సమయంలో వేలకోట్ల బకాయిలుంటే బీఆర్ఎస్ చెల్లించిందని, బీఆర్ఎస్ బకాయిలను మీరు తప్పించుకోరాదని ప్రభుత్వానికి సూచించారు. ఇది అత్యంత ప్రాధాన్యం గల అంశమని, చేస్తాం చూస్తామని కాకుండా బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయా అంశాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార ఇదేరోజు ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంగళవారం సాయంత్రం సమావేశం అయ్యారు. ఇంజినీరింగ్, టెక్నికల్ కళాశాలల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం నుంచి బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.