Mittapalli Surender | జయశంకర్ భూపాలపల్లి, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆత్మగౌరవాన్ని కవి, గాయకుడు అందెశ్రీ తాకట్టు పెట్టిండు.. తెలంగాణ కళాకారులు కట్టు బానిసలన్న అందెశ్రీ.. ఇప్పుడు ఆయన చేసేదేమిటని ప్రముఖ కవి, కళాకారుడు మిట్టపల్లి సురేందర్ ప్రశ్నించారు. తాము 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇప్పించామని, గెలిచిన ఆరునెలలకే మీలా పాట రికార్డు కోసం భజనలు చేయలేదని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని స్పష్టం చేశారు. కేసీఆర్.. తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసమని, తొమ్మిదిన్నరేండ్లలో ఆయన నడిపిన పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఆయనను వేలెత్తి చూపే నైతిక అర్హత రేవంత్‌రెడ్డికి లేదని తెలిపారు. రాచరిక చిహ్నాలు, రాచరిక గేయాలు, టీఎస్ లోగోల మార్పు ఇప్పుడే గుర్తుకు వస్తున్నాయా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అని మండిపడ్డారు. పాలన చేతకాక అనవసరపు రాద్ధాంతం చేస్తే మీ నాయకులే ఛీ కొడతారని తేల్చిచెప్పారు. రాచరికపు ఆనవాళ్లు రేవంత్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. తాను రాసిన తెలంగాణ జన గీతం దోసిళ్లతో తేనె ఎత్తుకుని తాగినట్టుంటది అని అన్నారు. మిట్టపల్లి సురేందర్ రాసిన జన గీతం నేడు జనం ముందుకు వస్తున్న సందర్భంగా నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు.
మిట్టపల్లి సురేందర్: రాజముద్ర పదేండ్ల క్రితం వచ్చింది కాదు. తెలంగాణ ఉద్యమకాలంలోనే ప్రముఖ చిత్రకారుడు లక్ష్యణ్ ఏలె ఎందరో మేధావులను, మరెందరో ఉద్యమ నేతలను కలిసి, వారి ఆలోచనలన్నీ సేకరించి చాలా శ్రమించి పొందుపర్చినదే ఆ చిహ్నం. దానికి వీళ్లు చీడపట్టినట్టు చేస్తున్నరు. 15 ఏండ్ల క్రితం డిజైన్ చేసిన తెలంగాణ చిహ్నాన్ని మార్చడం వల్ల రాష్ర్టానికి కొత్తగా నిధులొస్తయా, సంపద పెరుగుతుందా, ప్రజల కడుపు నిండుతుందా? ఇయాల నువ్ మారుస్తవ్, రేపు ఇంకో ప్రభుత్వం వస్తది. ఆ ప్రభుత్వం కూడా మారుస్తది కదా.. మీరు ఇగోలకు పోవడం వదిలేయండి. ప్రజలు ఏం కోరుకుంటరో అది చేయండి. పదేండ్ల నుంచి ఉన్న టీఎస్ బోర్డు తీసేసి టీజీ చేయడం.. ఎప్పటి నుంచో ప్రజల్లో ఉన్న గీతాన్ని మారుస్తాం అనడం.. సాహిత్యం మీద పట్టులేనోడు కూడా మాట్లాడుడేనా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి తెలంగాణకు తలవంపులు తెచ్చే ఆలోచనా విధానం ఇది. మన పక్క రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. మరి జగన్ ఇలా ఎందుకు మార్పులు చేయలేదు. రేవంత్‌కు ఇక్కడ పాలన ఎలా చేయాలో అర్థం కాక ఈ పనుల మీద పడ్డట్టు అనిపిస్తుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో జరిగిన నిర్ణయాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం లేదు. లోగో తయారు చేసినప్పుడు, పాట రూపొందించినప్పుడు, తెలంగాణ స్టేట్ అని పెట్టినప్పుడు ప్రజలకు ఒక విశ్వాసం ఏర్పడింది. అది ఏర్పడి పదేండ్లు గడిచాక ఇప్పుడు నువ్వేంది చేసేది. అప్పడు నువు ప్రతిపక్షంలో ఉన్నావు కదా, అప్పటి నుంచి ఎందుకు వ్యతిరేకించలేదు. చిహ్నంలో లోపాలున్నా, సరిచేయాలని ఎందుకు ఉద్యమాలు చేయలేదు. ఎందుకు పోరాటాలు చేయలేదు. ఇప్పుడా చిహ్నం గురించి మాట్లాడుడేంది.
గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, నందిని సిధారెడ్డి, కోదారి శ్రీనివాస్, ఏసుపాల్, చనిపోయిన సాయిచంద్ సహా ప్రభుత్వంతో దగ్గరగా ఉండి 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇప్పించాం. ఏ రోజూ వ్యక్తిగత పనులు చేసుకోలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి దగ్గరగా మెదిలిన కళాకారులందరినీ బానిసలు అన్నడు అందెశ్రీ. కూలీలు అన్నడు.. మేం బానిసత్వం చేసి, కూలిపని చేసి 550 మందికి ఉద్యోగాలు ఇప్పించినం. అందులో ఒక కళాకారున్ని రెండుసార్లు ఎమ్మెల్యే చేసినం. దేశపతి శ్రీనివాస్‌ను, గోరటి వెంకన్నను ఎమ్మెల్సీ చేసినం. సాయిచంద్‌ను ఒక చైర్మన్‌ను చేసినం. నందిని సిధారెడ్డిని ఒక బాషా సాంస్కృతికక శాఖకు చైర్మన్‌ను చేసినం. దర్శకుడు ఎన్ శంకర్‌కు స్టూడియోకు స్థలం ఇప్పించినం. విద్యార్థి పోరాటాలు చేసిన వారిని నాయకుల్ని చేసినం. నువ్వు (అందెశ్రీ) ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని కేవలం నీ పాట రికార్డు చేయడం కోసం భజన చేస్తున్నావు. అసలు నిజమైన కట్టుబానిసవు నువ్వు. పాట రికార్డు చేయడానికి సీఎంతో పనేంటి. నువు పాట రాస్తే సీఎం నీ దగ్గరికి రావాలి. నిజమైన బానిసవు నువ్వు. నిజంగా అమ్ముడుపోయినోడివి నువ్వు. తెలంగాణలో కళాకారులున్నారా అని ప్రశ్నించినవ్. నువు తెలంగాణ ఉద్యమానికి పాటలు రాసినప్పుడు.. 20 ఏండ్లకు ముందు పాటరాసుకుంటూ వచ్చినప్పుడు ఎవడు కట్టిండు బాణీలు.. ఎవడు ఎత్తుకొని తిరిగిండు నీ పాటను.. నువు పాట రాసినప్పుడు కీరవాణి దగ్గరికి వెళ్లి సంగీతం అడగలేదు. అప్పుడు గుర్తుకు రాలేదా కీరవాణి. అందెశ్రీకి ప్రజలతో సంబంధమే లేదు. ఒక తెలంగాణ ఉద్యమంలో నాలుగు పాటలు తప్పితే వేరే పాటలు చూపెట్టు. సింగరేణి కార్మికులపై రాసినవా? గీతకార్మికులపై రాసినవా? చేనేత కార్మికులపై రాసినవా? నిరుద్యోగులపై రాసినవా?
వంద శాతం ప్రజలు కోరుకుంటున్న పాటను అందిస్తున్నా. అమరుల త్యాగాల మీద పాట ఇస్తున్న. ప్రతి ఏటా తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఒక పాటను అందిస్తూ వస్తున్న. ఈసారి తెలంగాణ దశాబ్ది వేడుకలకు మంచి పాటను తీసుకొస్తున్న. ఈ పాట ప్రజల్లోకి వెళ్లుద్ది. పాడినవాళ్లు తెలంగాణ కళాకారులు. సంగీతం చేసినోళ్లు తెలంగాణోళ్లు. పాట దోసిళ్లతో తేనె ఎత్తుకుని తాగినట్టుంటది.
అసలు రాచరికపు ఆనవాళ్లు కేసీఆర్‌వి కావు. అసలు రాచరికపు ఆనవాళ్లు అనేవి రేవంతన్న దగ్గరే ఉన్నయ్. ఉద్యమకాలం నుంచి సీఎం అయ్యేదాక కేసీఆర్ ఒక పాట రాయించాలంటే తెలంగాణ మేధావి వర్గాన్ని సంప్రదించి చేసేటోడు. సీఎం అయ్యాక కూడా అందరి ఆధీనంలోనే ఉన్నడు ఆయన. కొన్ని కారణాల చేత పార్టీ ఓటమిపాలయ్యింది. ఆయన ఎవరికీ అన్యాయం చేయలే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలే. ప్రజలు ఏం కాంక్షించారో.. అది చేసి ప్రజలను మెప్పించారు. కేసీఆర్ రెప్పపాటు కరెంటు పోనియ్యలే. దమ్ముంటే కేసీఆర్ పాలనను దాటి చూపించు.
తెలుగు సినీ పరిశ్రమ లోపల ఆంధ్రా, తెలంగాణ అనే అభిప్రాయం పోయి పదేండ్లయింది. ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణ అనే అభిప్రాయాన్ని చంద్రబాబు శిష్యుడిగా రేవంత్‌రెడ్డి రెచ్చగొడుతున్నాడు. అందెశ్రీ అనేటోడు కండ్లు మూసుకుని అంధునిలా ప్రవర్తిస్తూ కీరవాణికి పాట ఇచ్చి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నడు. జనం మరిచిపోయి కలిసిపోయిన సమాజాన్ని విడగొడుతున్నాడు. కీరవాణిది తప్పులేదు. జాతీయ, ప్రపంచ కళాకారుడు అతను. కానీ అందెశ్రీ రాసిన పాట తెలంగాణ ప్రాంతీయుల ఆత్మగౌరవానికి సంబంధించింది. అది తెలంగాణ ప్రాంతం వాళ్లే చేయాలి. దాని హక్కుదారులు తెలంగాణ వారే. అనవసరంగా అందెశ్రీ వెళ్లి కీరవాణిని బదనాం చేసి ఆయన పేరు చెడగొడుతున్నడు. కీరవాణి అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తి. కానీ అందెశ్రీకి ఒక ప్రాంతం ఉంది. ఒక ప్రాంతం మీద రాస్తేనే తనకు పేరొచ్చింది. ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’ అన్నట్లు అందెశ్రీ కూడా మాయమైపోతున్నడు తెలంగాణలో.