హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): పాఠశాలల స్థాయినుంచే డ్రగ్స్ వినియోగం పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం నిరుడు డిసెంబర్లో ‘మిత్ర-టీజీ’ అనే ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను తీసుకువచ్చింది. ఇది మంచి సత్ఫలితాలివ్వడంతో మరో వెయ్యి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశపెట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తెలంగాణ యాంటీ-నారోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) సహకారంతో ఐటీశాఖ ద్వారా ఈ ‘మిత్ర-టీజీ’ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేశారు.
ఈ చాట్‌బాట్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని గుర్తించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. 18 ఏండ్లలోపు పిల్లల వయసు, నిద్ర, ఆహారపు అలవాట్లు, చదువు, సామాజిక నైపుణ్యాలు, ఇతర అంశాల ఆధారంగా ఈ చాట్‌బాట్ ప్రశ్నలు సిద్ధం చేస్తుంది. ఈ సమాచారం ఆధారంగా పిల్లల ప్రవర్తనలో మార్పులు గుర్తించి అవసరమైతే సలహాలు, క్లినికల్ అసవరం వంటి సూచనలను ఇస్తుంది. అదేవిధంగా విద్యార్థుల గోప్యతను పాటిస్తుంది. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో దీనిని రూపొందించారు.