హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): అల్లర్లు, హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లోని మన విద్యార్థులను స్వరాష్ర్టానికి తీసుకురావటంలో రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పనిచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా కార్యాచరణతో అధికారులకు బాధ్యతలు అప్పగించి, కిందిస్థాయి కంట్రోల్ రూమ్ సిబ్బంది నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు సమన్వయం చేసుకుంటూ మన వారిని క్షేమంగా స్వస్థలాలకు చేరవేశారు. ఆ రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే సీఎం ఆదేశాలతో డీజీపీ నేతృత్వంలో ముగ్గురు అడిషనల్ డీజీలు, ఒక డీఐజీ, డీఎస్పీ, ఇన్స్పెక్టర్, కిందిస్థాయి సిబ్బందితో ఓ టీమ్ సిద్ధమైంది. ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి, డీఐజీ సుమతిని ఇంచార్జిగా నియమించారు. గంటల వ్యవధిలోనే పదుల సంఖ్యలో కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. వారు ఉంటున్న ప్రదేశం, అక్కడి పరిస్థితులను తెలుసుకొని మణిపూర్ పోలీసులతో గ్రేహౌండ్స్ ఏడీజీ విజయ్‌కుమార్ మాట్లాడారు. మన వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రతి క్షణం అప్రమత్తం చేశారు. హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్ ఆధారంగా భోజన వసతి కల్పించారు. అడిషనల్ డీజీల్లో ఒకరు ఇక్కడి అధికారులను సమన్వయం చేసుకోగా, మరొకరు అక్కడి అధికారులతో సమన్వయం చేసుకున్నారు. అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ నిలిపివేయడంతో ఎస్ఎంఎస్లతోనే అందర్నీ కోఆర్డినేట్ చేశారు. సుమారు ఆరుచోట్ల కాంటాక్ట్ పాయింట్లు ఏర్పాటు చేసి, అందర్నీ ఒకచోటుకు చేర్చారు.
ఆంధ్ర, తెలంగాణ భేదం లేకుండా..
ఏపీ విద్యార్థులు, వ్యాపారులు కూడా హెల్ప్‌లైన్‌ను సంప్రదించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వీరికి కూడా టికెట్లు బుక్ చేయించారు. ఎప్పటికప్పుడు పీఎన్ఆర్ నంబర్లు పంపించారు. విద్యార్థులు ఉంటున్న హాస్టల్స్, పని ప్రదేశాలకు పోలీస్ ఎస్కార్ట్‌తో వెళ్లి సురక్షితంగా విమానం ఎక్కించి, క్షేమంగా ఇండ్లకు చేరేలా చర్యలు తీసుకున్నారు. మంగళవారం సురక్షితంగా ఇండ్లకు చేరుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ చొరవకు ముగ్ధులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి.. ‘థ్యాంక్స్ టు సీఎం కేసీఆర్ సార్ అండ్ తెలంగా ణ పోలీస్’ అంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
‘ప్లాన్ బీ’ అవసరం లేకుండానే..
సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు ‘ప్లాన్ బీ’ని కూడా సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం చేపట్టిన ఆపరేషన్ అనుకూలంగా లేకపోతే, ప్లాన్ బీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను సంప్రదించిన వారి వివరాలను బట్టి.. వారందరినీ స్థానిక అస్సాం రైఫిల్ పోలీస్ క్యాంప్‌నకు తరలించి.. అల్లర్లు సద్దుమణిగే వరకు అక్కడే ఉంచాలని నిర్ణయించారు. ఇందుకు ఏర్పాట్లు చేశారు. ప్లాన్ బీ అవసరం లేకపోయింది.
అత్యుత్తమ సేవలు : డీజీపీ
మణిపూర్‌లో తలెత్తిన అల్లర్ల నేపథ్యంలో అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు, పౌరులను సురక్షితంగా హైదరాబాద్‌కు తరలించడంలో కృషి చేసిన పోలీసులను డీజీపీ అంజనీకుమార్ మంగళవారం అభినందించి, సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ అధికారులు అత్యుత్తమ సేవలందించారని ప్రశంసించారు. మణిపూర్‌లో సరైన కమ్యూనికేషన్ సౌకర్యాలు లేకున్నా.. అకడి పోలీస్, మిలటరీ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించడం, అకడి తెలంగాణ వాసులతో మాట్లాడి ఇకడికి రప్పించడం, వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని అన్నారు. అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇతర శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి 112 మందిని సురక్షితంగా తెలంగాణకు చేర్చగలిగామని పేరొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీలు శివధర్‌రెడ్డి, అభిలాషబిస్త్, ఐజీలు షానవాజ్‌ఖాసీం, ఎం రమేశ్, డీఐజీ బీ సుమతి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో విధులు నిర్వహించిన జయరాం, నగేశ్‌బాబు, తిరుపతి, సుదర్శన్ తదితర పోలీస్ అధికారులను డీజీపీ సన్మానించారు.
అర్ధరాత్రి పూట కూడా కాల్స్ వచ్చాయి
హెల్ప్‌లైన్‌కు కాల్ చేసిన ప్రతి ఒక్కరికీ రెండ్రోజులు కాల్ చేశాం. ప్రతి ఒక్కరిని సముదాయించాం. ఎంతోమంది ‘అక్కా..అక్కా’ అంటూ ఆప్యాయంగా పలకరించారు. అర్ధరాత్రి పూట భయమేసి కొందరు ఆడపిల్లలు ఫోన్ చేసి ఏడ్చేశారు. అందులో ఆంధ్రాకు చెందిన విద్యార్థులు, పౌరులు కూడా ఉన్నారు. వారికి ధైర్యం చెప్పి, సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాం. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో హెల్ప్‌లైన్‌కు నన్ను ఇంచార్జిగా నియమించడం గొప్పగా ఉంది. విద్యార్థులు ఇంటికొచ్చేసరికి తల్లిదండ్రుల కండ్లలో ఆనందం వెలకట్టలేనిది. ఈ మంచిపనిలో భాగస్వామినైనందుకు సంతోషంగా ఉన్నది.
– బీ సుమతి, డీఐజీ