తెలంగాణలో వార్ వన్‌సైడే.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా.. ఏ ప్రామాణిక సర్వేల్లోనైనా స్పష్టమవుతున్నది ఇదే. అసెంబ్లీ ఎన్నికలపై శాస్త్రీయంగా నిర్వహిస్తున్న సర్వేల్లో సబ్బండ వర్ణాలు సంక్షేమ సారథి కేసీఆర్ వెంటే ఉంటామని వెల్లడిస్తున్నారు. నిన్న ఇండియా టీవీ, ఫ్యాక్ట్స్ మార్కెటింగ్ సంస్థ.. ఈ రోజు ’మిషన్ చాణక్య’ సర్వేల్లోనూ బీఆర్ఎస్ రీసౌండింగ్ విక్టరీ ఖాయమని తేలింది. 70కిపైగా సీట్లతో రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరనున్నదని వెల్లడయ్యింది. కారు స్పీడుకు కాంగ్రెస్, బీజేపీ సైడైపోయినట్టు సర్వేల్లో తేలింది.
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): అబద్ధపు ప్రచారాలు, అంచనాలను తలకిందులు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో హై స్పీడ్‌తో దూసుకుపోతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో చెక్కుచెదరని ప్రజా మద్దతు, ప్రజాభిమానాన్ని నిలుపుకొంటున్నది. ఇదే విషయం ప్రముఖ సర్వే సంస్థ ‘మిషన్ చాణక్య’ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాష్ట్రంలోని యువత, ఉద్యోగార్థులు బీఆర్ఎస్ పాలనపై సంతృప్తిని వ్యక్తంచేస్తున్నారని, బీసీలు, ముదిరాజ్‌లు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కొలువుదీరాలని కోరుకుంటున్నట్టు తేలింది. కొత్త ఓటర్ల నుంచి మొదలుకొంటే పండు ముసలివరకూ అంతా బీఆర్ఎస్వైపే మొగ్గుచూపిస్తున్నట్టు ఆ సంస్థ పేర్కొన్నది. రాష్ట్రంలో మరోసారి అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని తేల్చి చెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పక్కాగా 76 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇక కాంగ్రెస్ 20 -25కే పరిమితం కానుండగా, సోషల్ మీడియా పులి బీజేపీకి 9 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలింది. ఎంఐఎం పార్టీ తన 7 అసెంబ్లీ సెగ్మెంట్లను నిలుపుకోనున్నది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల రాష్ట్రంలోని 85శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇక సామాజికవర్గాల వారీగా తీసుకొంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ అనే తేడా లేకుండా బీఆర్ఎస్ పార్టీకి అందరి అండ పుష్కలంగా లభిస్తున్నది. అన్నింటికంటే అధికంగా మైనార్టీల్లో 48.31 శాతం మద్దతును బీఆర్ఎస్ సాధించగలిగింది. బీసీ నినాదంతో కొన్ని పార్టీలు లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నా, వారిని బీసీలు నమ్మడం లేదు, విశ్వసించడం లేదని సంస్థ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘మిషన్ చాణక్య’ రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం నిర్వహించింది. ‘నా రాష్ట్రం-నా ఓటు-నా నిర్ణయం’ ట్యాగ్‌లైన్‌తో పరిశోధన నిర్వహించి సంస్థ ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయా అధ్యయన నివేదికను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 117 నియోజకవర్గాల్లో 14 లక్షల శాంపిళ్లను అధ్యయనం చేసిన సంస్థ ఆయా వివరాలను వెల్లడించింది. మే నెలకు ముందు, మే నుంచి ఇప్పటి వరకు రెండు విడతల్లో ఈ సంస్థ అధ్యయనం చేసింది. మే నెల ముందు వరకు బీఆర్ఎస్కు 46.75 శాతం ఓట్లు, మే నుంచి ఇప్పటి వరకు 44.62 శాతం ఓట్లు వస్తాయని మిషన్ చాణక్య సంస్థ చైర్మన్ ఏ శివకేశవ్ వెల్లడించారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల తర్వాత మహిళావర్గం నుంచి సానుకూలత వ్యక్తమవుతున్నదని శివకేశవ్ తెలిపారు. తాము ఏ పార్టీకి అనుకూలం కాదని, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఈ నివేదికను వెల్లడించామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న హడావిడికి.. సర్వే ఫలితాలకు అస్సలు పొంతన ఉండటం లేదు. కాంగ్రెస్ నేతలు ప్రమాణస్వీకార తేదీలు.. నేనే సీఎంనంటూ ప్రగల్భాలు పలుకుతుండగా, క్షేత్రస్థాయిలో వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. మిషన్ చాణక్య సర్వేలో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ మధ్య ఓట్ల శాతం తేడాయే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నది. బీఆర్ఎస్కు 44.62 శాతం, కాంగ్రెస్‌కు 32.71 శాతం ఓట్లు వస్తాయని మిషన్ చాణక్య సంస్థ వెల్లడించింది. అంతే ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 11.91 శాతం. ఒక్కోసారి ఓట్ల శాతం రెండు, మూడు శాతం ఉండగా ఫలితాల్లో భారీ తేడాలున్న సందర్భాలెన్నో ఎన్నికల్లో జరిగాయి. ఈ లెక్కన 11 శాతం తేడా ఉందంటేనే కాగ్రెస్ ఏ దశలోనూ పోటీనిచ్చే పరిస్థితి కనిపించడం లేదు.