Ponguleti Srinivas Reddy | కూసుమంచి, సెప్టెంబర్ 23: నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడం.. కుటుంబ పోషణ భారంగా మారడంతో మనోవేదనతో ఓ కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో మంగళవారం చోటుచేసుకున్నది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చందనబోయిన గాంధీ (32) ఎనిమిదేండ్లుగా పాలేరులోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్లో కార్మికుడిగా పని చేస్తున్నాడు.
వేతనాల కోసం 20 రోజుల క్రితం తోటి కార్మికులతో కలిసి ఆందోళనకు దిగడంతో అధికారులు, మిషన్ భగీరథ గుత్తేదారులు జీతాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో వారంతా విధుల్లో చేరారు. 20 రోజులు దాటినా జీతాలు రాకపోవడంతో సోమవారం నుంచి మిషన్ భగీరథ కార్మికులు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మంగళవారం కార్మికులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న గాంధీ మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీ మృతదేహాన్ని మిషన్ భగీరథ పంపుహౌస్ వద్దకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులు, కార్మికులు ధర్నాకు దిగారు. మిషన్ భగీరథ గుత్తేదారు, అధికారులు గాంధీ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గాంధీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూసుమంచి ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.