కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ద్వారా మిషన్ భగీరథతో తాగునీటికి శాశ్వత భరోసా లభించింది. ప్రాజెక్టులో భాగంగా 30టీఎంసీలను హైదరాబాద్ తాగునీటికి, 10టీఎంసీలను ఎన్‌రూట్ గ్రామాల తాగునీటికి కేటాయించారు. హైదరాబాద్‌కు తాగునీటి కరువన్నదే లేని పరిస్థితి కాళేశ్వరం ద్వారా సాధ్యమైంది. నిజాం రాజు నిర్మించిన హుస్సేన్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలే తప్ప 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తాగునీటికే అంకితం చేస్తూ నిర్మించిన ఏ ఒక్క జలాశయము లేదు.
తొలుత సింగూరు నుంచి, అది చాలకపోవడంతో కృష్ణా నుంచి, తుదకు గోదావరి నుంచి జలాల తరలింపు చేపట్టారు. అయినప్పటికీ భాగ్యనగరవాసుల దాహార్తిని తీర్చలేని దుస్థితి. కారణం ఉమ్మడి పాలకుల అనుసరించిన విధానలోపం. అయితే, హైదరాబాద్‌కు శాశ్వత భరోసాను కల్పించింది కాళేశ్వరం. దీని ద్వారా హైదరాబాద్ చెంతనే నగరజనాభా నీటి అవసరాల కోసం 65టీఎంసీలు స్టోరేజీ అందుబాటులోకి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 15టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్, 50 టీఎంసీల సామర్థ్యంగల మల్లన్నసాగర్ ఇందులో భాగమే.