హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ బిల్లులు చెల్లించాలని మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఎస్ఆర్టీజీఎన్ భవన్ (మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయం) ఎదుట బుధవారం బైఠాయించారు. రాష్ట్రంలోని భద్రాచలం, ములుగు, సూర్యాపేట, వరంగల్, నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం తదితర జిల్లాల నుంచి వచ్చిన సుమారు 50-60 మంది చిన్న కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాము చేసిన పనులకు రెండేండ్లుగా బిల్లులు చెల్లించడం లేదని, తమకు రూ. 224 కోట్లు రావాల్సి ఉన్నదని చెప్పారు. ఎల్అండ్టీ, ఎన్సీసీ, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ వంటి పెద్ద సంస్థలకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమకు రెండేండ్లుగా చెల్లించడం లేదని వాపోయారు.
మిషన్ భగీరథ పథకం కింద ప్రతి గ్రామంలో ఇంటింటికీ పైప్లైన్లు వేసి నల్లా కనెక్షన్లు ఇచ్చామని, ఒక్కో కాంట్రాక్టర్‌కు రూ.20లక్షల నుంచి రూ. కోటికిపైగా వరకు రావాల్సి ఉన్నదని తెలిపారు. అదే సమయంలో మిషన్ భగీరథ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమశాఖపై సమీక్ష నిర్వహిస్తున్న ఆ శాఖ మంత్రి సీతక్కకు ధర్నా విషయం తెలిసి కాంట్రాక్టర్లను తన వద్దకు పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. త్వరలోనే రూ.100 కోట్ల వరకు ఇప్పించే ప్రయత్నం చేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భిక్షంరెడ్డి, విజేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, సంతోష్, నితీశ్, పుల్లయ్య, రహీం తదితరులు పాల్గొన్నారు.