Miss World Competition | హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): మిస్ వరల్డ్ స్పాన్సర్షిప్ వివాదాన్ని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి మెడకు చుట్టేందుకు ప్రభుత్వంలోని కొందరు కుట్ర పన్నుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అందాల పోటీలకు నిధులిస్తామని వాణిజ్య సంస్థలు ముందుకొచ్చినా… ఆమె నిర్లక్ష్యంతో వెనకి వెళ్లిపోయారనే అపవాదును ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెరమీదకు తెచ్చినట్టు సమాచారం. సదరు మహిళా అధికారి ఉదాసీనత కారణంగానే రాష్ట్ర ఖజానా మీద రూ.27 కోట్ల భారం పడిందని ఆమెపై ఆరోపణ చేసి, అందుకు బాధ్యురాలిని చేసేందుకు సీఎంవోలో పక్కా స్క్రిప్ట్ తయారు చేస్తున్నట్టు సమాచారం. ఖరీఫ్ విత్తనాలు, తడిసిన వడ్ల కొనుగోలు కోసం రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రూ.200 కోట్లు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహించడం ఎందుకని ప్రతిపక్ష పార్టీలు నిలదీశాయి.
దీంతో మీడియా ముందుకు వచ్చిన సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.. అందాల పోటీలకు రూ.54 కోట్లు ఖర్చవుతుందని, ఇందులో 50 శాతం అంటే రూ.27 కోట్ల వరకు మిస్ వరల్డ్ నిర్వహణ సంస్థ భరిస్తుండగా మిగతా సగం ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉన్నదని ప్రకటించారు. ప్రభుత్వం పెట్టాల్సిన ఖర్చులో రూ.25 కోట్ల మేర నిధులు సమకూర్చేందుకు స్పాన్సర్లతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఈ మేరకు ఫార్మా, మీడియా, రియల్ ఎస్టేట్, పర్యాటక, బ్యాంకింగ్ సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపినట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
ముందుకొచ్చిన జాతీయ బ్యాంక్
ఓవైపు మిస్‌వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లండ్ ఆరోపణలతో వివాదాస్పదం కావడం, మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఇంతవరకు ఈ ఈవెంట్‌ను స్పాన్సర్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని తెలిసింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓ స్పాన్సర్‌ను సాధించలేకపోయిందన్న విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఇందుకు ఓ ఐఏఎస్ అధికారిని బాధ్యురాలిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అందాల పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పాన్సర్ చేసేందుకు ఓ బ్యాంక్ యాజమాన్యం ముందుకు వచ్చిందని, రూ.25 కోట్లు ఏకమొత్తంగా ఖర్చు చేసేందుకు ఆసక్తిని చూపిందని, మిస్ వరల్డ్ పోటీలకు అప్పట్లో ఇన్చార్జిగా వ్యవరించిన అధికారిని కలిసేందుకు వెళ్లగా.. ఆమె అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఓ కథనాన్ని ప్రభుత్వంలోని కొందరు తెర మీదకు తెచ్చారు.
దాదాపు నాలుగైదు గంటలు వేచి ఉన్న జాతీయ బ్యాంకు యాజమాన్యం.. ఆ అధికారిని కలిసి తమ ఆసక్తి వ్యక్తం చేయగా.. ‘మీరు ఒకరే ఎలా స్పాన్సర్ చేస్తారు, అందరికీ అవకాశం ఇవ్వాలి కదా’ అంటూ ఆ బ్యాంక్ స్పాన్సర్‌ను తిరసరించినట్టు చెప్తున్నారు. ముందుగా ఈ కథనాన్ని ప్రభుత్వ అనుకూల మీడియాగా ముద్రపడిన ఓ ఎల్లో ప్రతికలో ప్రముఖంగా ప్రచురించారు. అనంతరం ఆ ప్రచారాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా అందుకొని గత రెండు రోజుల నుంచి విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. మరో అధికారి కూడా చిన్న స్పాన్సర్ కంపెనీల నుంచి వచ్చే స్సాన్సర్షిప్ల నుంచి కమీషన్లు ఆశించినట్టు ప్రచారం జరుగుతున్నది.
ఎట్లాగైనా ఇరికించాలె
ఇద్దరు అధికారుల మీద దృష్టి పెట్టిన ప్రభుత్వంలోని కొందరు నిఘా వర్గాలను రంగంలోకి దించినట్టు తెలిసింది. మిస్‌వరల్డ్ పోటీలకు స్పాన్సర్లు రాకపోవడానికి గల కారణాలను నిఘా అధికారులు అన్వేషిస్తున్నట్టు సమాచారం. పోటీల ప్రారంభానికి ముందు కీలకంగా వ్యవహరించిన అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మరో అధికారి ప్రమేయం కూడా ఇందులో ఉందనేలా వార్తా కథనాలను వడ్డివార్చేందుకు సీఎం ఆఫీస్‌లోనే కసరత్తు జరుగుతున్నదని తెలుస్తున్నది. సద రు అధికారిణి ఇటీవల కంచ గచ్చిబౌలి భూ ముల వ్యవహారంపైనా సోషల్ మీడియాలో పోస్ట్ రీట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మా రింది.ఆ రీట్వీట్‌తో ప్రభుత్వం ఇరుకున పడిందని, అందుకే ఆ అధికారిని బద్నాం చేయాలని కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.