గోదావరిఖని, మార్చి 9: సింగరేణి యాజమాన్యం తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి, కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, ఉపాధ్యక్షుడు నూనె కొమురయ్యతో కలిసి మాట్లాడారు. ఏడాది కాలంగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో వేలాదిమంది కార్మికుల పిల్లలు ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి నెలా రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మండిపడ్డారు. మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్ వెంకటస్వామి తక్షణమే స్పందించి మెడికల్ బోర్డు ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. గతేడాది మెడికల్ బోర్డుకు హాజరైన కార్మికులు, సర్ఫేస్ విభాగానికి బదిలీ చేసినవారికి భూగర్భగనిలో చేసే పాత పనిని కొనసాగించాలని ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి, వారికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.