న్యూఢిల్లీ, జూలై 28/(స్పెషల్ టాస్క్ బ్యూరో): నీట్ పేపర్ లీకేజీపై గళమెత్తిన విద్యార్థులపై కేంద్రం కక్ష సాధింపులకు దిగినట్టు తెలుస్తున్నది. డిమాండ్లకు ఒప్పుకొన్నట్టు ఒకవైపు హామీ ఇచ్చినట్టే ఇచ్చి మరోవైపు నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను టార్గెట్ చేస్తున్నట్టు అర్థమవుతున్నది. నిరసనల్లో పాల్గొన్న దాదాపు 70 మంది విద్యార్థులను ఇటీవల అదుపులోకి తీసుకొన్న కేంద్రం.. ఇందులో కొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు, విపక్ష నేతల ఒత్తిడితో అదుపులోకి తీసుకొన్న విద్యార్థులను విడిచిపెట్టినప్పటికీ, కొందరిని వ్యక్తిగతంగా పోలీసులు టార్గెట్ చేసినట్టు సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేశారు. విచారణ పేరిట ఇంటికి వచ్చి వేధించినట్టు కొందరు వీడియోల్లో తెలిపారు. ఇక, జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోలు, పోస్టులను తొలగించడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు విద్యార్థులు చేసిన వందలాది పోస్టులను తొలగించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు లేఖ రాశారు. ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కొన్ని తప్పుడు పోస్టులు, ఏఐ వీడియోలు ఉన్నాయన్న కారణంతో పోలీసులు ఈ చర్యలకు దిగారు.
మద్దతు తెలిపిన వారిపై కూడా..
విద్యార్థులపైనే కాదు నిరసనలకు మద్దతు ప్రకటించిన వారిపై కూడా కేంద్రం కక్షపూరిత చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. జంతర్‌మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు ఆహారం పంపిణీ చేసినందుకు ఢిల్లీ పోలీసులు తనను నిర్బంధించారని సీజేపీ వలంటీర్ జునైద్ తాజాగా ఆరోపించారు. ఘజియాబాద్‌లోని తన ఇంటిపై పోలీసులు దాడి చేసి కీలక పత్రాలను పట్టుకుపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఆహార ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకొన్న పోలీసులు, ఇంత పెద్దమొత్తంలో ఫుడ్‌కు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ తనను బెదిరించారని జునైద్ చెప్పారు. అంతటితో ఆగని పోలీసులు తన తండ్రిని పట్టుకొనిపోయారని వాపోయారు. ఈ పరిణామం రాజకీయంగా దుమారం రేపింది. జునైద్‌పై పోలీసుల వైఖరిని సీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఖండించాయి. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి.. జునైద్‌ను కలుసుకొని, ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానని చెబుతూ తన మద్దతు ప్రకటించారు.
పెల్లెట్ గన్ నుంచి 7 రౌండ్ల కాల్పులు!
సీజేపీ ఈ నెల 20న చలో పార్లమెంట్ నిరసన ప్రదర్శన సందర్భంగా న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో మోహరించిన సీఆర్పీఎఫ్ ఆర్ఏఎఫ్ సిబ్బంది ఒకరు తన పెల్లెట్ గన్‌తో కనీసం ఏడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సీఆర్పీఎఫ్ గుర్తించినట్లు తెలిసింది. వాటిలో ఐదు రౌండ్లు నిరసనకారులకు తగలగా రెండు నేలను తాకాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఇచ్చిన మాట నిలబెట్టుకోండి కేంద్రానికి సీజేపీ డిమాండ్
నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జిరిగిన ఆందోళన సందర్భంగా అరెస్టు చేసిన విద్యార్థులు, నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సోమవారం డిమాండ్ చేసింది. నిరసనకారులపై ఎటువంటి శిక్షాత్మక చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సీజేపీ పేర్కొంది. ముఖ్యంగా అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్‌లో విద్యార్థులు, నిరసనకారులను ప్రభుత్వ యంత్రాంగాలు లక్ష్యంగా చేసుకోవడం, నిర్బంధించడం లేదా అరెస్టు చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు తమకు అనేక నివేదికలు అందాయని సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా నిరసనకారులపై నమోదైన పోలీసు కేసులను ఉపసంహరించుకోవడానికి, కొత్తగా ఎటువంటి కేసులు నమోదు కాకుండా చూడటానికి ఈనెల 28 నాటికి దీనికి సంబంధించిన లిఖితపూర్వక హామీని ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.
ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని దాస్ తన ప్రకటనలో అర్థించారు. అదుపులోకి తీసుకున్నవారిని విడుదల చేయడం ద్వారా, దేశంలో ఎక్కడా ఏ నిరసనకారుడిపైన బలవంతపు లేదా ప్రతీకార చర్యలు తీసుకోకుండా మాకు ఇచ్చిన హామీని వెంటనే నిలబట్టుకోవాలి అని కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. చర్చల సమయంలో ఇచ్చిన హామీల నుండి ఏమాత్రం పక్కకు తప్పుకున్నా, అది కేవలం సీజేపీతోనే కాకుండా, నిరసనల కంటే చర్చల మార్గాన్ని ఎంచుకున్న లక్షలాది మంది యువ భారతీయులకు కూడా నమ్మకద్రోహం చేసినట్లవుతుందని దాస్ తన ప్రకటనలో హెచ్చరించారు. కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు అవసరమయ్యే న్యాయ సహాయం కోసం తాను రూ.1 కోటి ఇస్తున్నట్టు, దీంతో లీగల్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్టు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఈ సందర్భంగా ప్రకటించారు.