గోదావరిఖని : సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలపై(,Singareni dues) ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్ ) అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థకు ఇప్పటివరకు ట్రాన్స్కో, జెన్కోల నుంచి బొగ్గు అమ్మకాల ద్వారా బకాయిలు రూ. 47 వేల కోట్లకు చేరుకున్నాయని వీటిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే 24 వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని విమర్శించారు.
పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో సింగరేణి సంస్థ కార్మికులకు జీతాలు చెల్లించడానికి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని దీనికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడంతో పాటు కార్మికుల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని..ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తీవ్రమైన రాజకీయ జోక్యంతో తమ ఇష్టం వచ్చిన రీతిలో సింగరేణి సొమ్మును వాడుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.
సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోతున్న.. ఆ విషయంలో గుర్తింపు కార్మిక సంఘమైన ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సింగరేణి నిధుల దుర్వినియోగంపై సంస్థకు రావాల్సిన బకాయిలపై సింగరేణి సంస్థ ద్వారా పూర్తి వివరాలతో కూడిన శ్వేత పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు గడిచిన రెండు సంవత్సరాల కాలంలో కార్మికులకు సంబంధించిన ఎలాంటి సమస్యలు పరిష్కారం చేయలేదని సింగరేణి సంస్థ నిర్వీర్యం అవుతున్న పట్టించుకోవడంలేదన్నారు. ఇవి చాలదన్నట్లు టీబీజీకేఎస్ పై నోరు పారేసుకుంటూ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో టీబీజీకేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, నాయకులు నూనె కొమరయ్య, తదితరులు పాల్గొన్నారు.