Sports | ఖమ్మం రూరల్ : గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుల్లో క్రీడా సామర్థ్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరూరా లక్షల రూపాయలు వెచ్చించి ఖరీదైన సర్కారు భూములలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత సర్కార్ నిర్లక్ష్యం కారణంగా క్రీడా ప్రాంగణాల ఉద్దేశం పక్కదారి పడుతుంది.
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో ఏర్పాటైన తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఏకంగా మిర్చి తోట సాగు చేయడం పట్ల గ్రామస్తులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం అది మిర్చి తోటగా మారడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగు నెలల నుంచి క్రీడా ప్రాంగణంలో మిర్చి తోట కనిపిస్తున్నప్పటికీ అధికారులు అటువైపుగా చూడకపోవడం విశేషం. ఇప్పటికే మండల కేంద్రం పెద్దతండ పంచాయతీలోని క్రీడా ప్రాంగణంలో మొక్కల పెంపకం చేపట్టారు. మరికొన్ని గ్రామాల్లో సైతం క్రీడా ప్రాంగణాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు ఇష్టాలకు అనుగుణంగా వాడుకుంటున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.