హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ) : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 14 నెలలుగా గురుకులాల భవనాల కిరాయిలు చెల్లించని వైనం.. పలుమార్లు నిరసనలు.. తాళాలేస్తామని యజమానుల అల్టిమేటం.. ఖాతరు చేయని ప్రభుత్వం.. ఫలితంగా నేడు ప్రారంభంరోజే రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ గురుకులాల భవనాలకు యాజమాన్యాలు తాళాలు వేసి నిరసన తెలిపారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు బయటే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే సోమవారం లోగానైనా అద్దెలను చెల్లించాలని యజమాన్యాలు ఈ సందర్భంగా మరోసారి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతోపాటు, ప్రీ మెట్రిక్, పోస్ట్మెట్రిక్ హాస్టళ్లన్నీ దాదాపు 750 వరకు కిరాయి భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాలకు చెల్లించాల్సిన కిరాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నెలలుగా నిలిపేసింది. ఒక్కో భవన యజమానికి సగటున రూ.20 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.కోటి వరకు బకాయిలను చెల్లించాల్సి ఉన్నది. మొత్తంగా రూ.400 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని తెలుస్తున్నది.
ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం, మరోవైపు భవనాలను నిర్వహించలేక యజమానులు పోరుబాట పట్టారు. కిరాయిలు చెల్లించాలని, లేదంటే ఖాళీ చేయాలని నోటీసులు కూడా జారీచేశారు. అయినా స్పందన లేకపోవడంతో 12వ తేదీలోగా బకాయిలను చెల్లించకుంటే తాళాలు వేస్తామని, భవనాలను స్వాధీనం చేసుకుంటామని మరోసారి అల్టిమేటం జారీచేశారు. అయినా సర్కారులో చలనంలో లేకుండాపోయింది. దీంతో గురువారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ గురుకుల భవనాలకు సంబంధిత యజమానులు తాళాలు వేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ గురుకులాల భవనాలకు యాజమాన్యాలు తాళాలేసిన సమాచారం తెలుసుకున్న మిగతా సొసైటీల ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. బీసీ గురుకుల సొసైటీలో 10 నెలల బకాయిలకు గాను వెనువెంటనే 4 నెలల కిరాయి చెల్లించారు. ఎస్సీ గురుకుల సొసైటీలో 18 నెలల బకాయిలకు 3 నెలల కిరాయి చెల్లించారు. మైనార్టీ సొసైటీలో 14 నెలల బకాయిల్లో ఒక్క నెల కూడా చెల్లించకపోవడం గమనార్హం.