న్యూఢిల్లీ : దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం మరోసారి మార్గదర్శకాలను పొడిగించింది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు మార్గదర్శకాలు అమలులో ఉంటాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఇంతకు ముందు కేంద్రం ఈ నెలాఖరు వరకు మార్గదర్శకాలు అమలులో ఉంటాయని పేర్కొంది. తాజాగా గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో మరోసారి పొడిగించింది. ఇదే సమయంలో కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. వైరస్ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేసేందుకు విపత్తు నిర్వహణ చట్టంలోని ఆయా నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి అజయ్ భల్లా కోరారు.
వైరస్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. దేశంలో రోజువారీ కేసులు, బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుందన్న ఆయన.. పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన అందరికీ టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చెప్పారు. కొవిడ్ కట్టడికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సలహాలు, సూచనలు తీసుకోవాలని.. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని అజయ్‌భల్లా సీఎస్‌లకు సూచించారు.