సుబేదారి, జనవరి 6 : మంత్రుల పర్యటన అత్యవసర అంబులెన్స్ సేవలకు అటంకం కలిగించింది. పోలీసులు అతిగా వ్యవహరించడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని హాస్పిటల్‌కు తరలించే అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ముగ్గురు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సోమవారం హనుమకొండ హయగ్రీవాచారి మైదానంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమం తర్వాత మంత్రుల కాన్యాయ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డువైపు వెళ్తున్న క్రమంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హనుమకొండ బస్‌స్టేషన్ వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో బాలసముద్రం వైపు వెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. డ్రైవర్ సైరన్ కొట్టినా ముందుకు వెళ్లలేనిస్థితి నెలకొంది. చాలాసేపు తర్వాత అంబులెన్స్ డ్రైవర్ వెనుకకు వచ్చి మరోదారిలో వెళ్లారు. ఈ పరిస్థితి చూసినవారు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.