హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ)/మాదాపూర్: పచ్చదనం పెంపుకోసం, జల సంరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ప్రాపర్టీ షో-2024కు మంత్రులు ముఖ్యఅతిథులుగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతున్నదని తెలిపారు.
మెట్రో రైలును మరింత విస్తరించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకొంటామని వెల్లడించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రతి ఒకరు పచ్చదనం వైపు నడవాలనే మంచి ఉద్దేశంతో ఐజీబీసీ పనిచేస్తున్నదని తెలిపారు. ఐజీబీసీ చేస్తున్న కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం ఇంకుడు గుంతల నిర్మాణం కోసం జలమండలి రూపొందించిన బ్రోచర్‌ను మంత్రులు పరిశీలించారు. కార్యక్రమంలో ఐజీబీసీ చైర్మన్ సీ శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, జలమండలి ఇంకుడు గుంతల ప్రత్యేకాధికారి జాల సత్యనారాయణ, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.