Telangana | హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘పొద్దుగాళ్ల శాసనసభ.. సాయంత్రం విగ్రహావిష్కరణ సభ.. ఒక్కరోజే రెండు సభలు పెట్టుడు ఏందో అర్థమైతలేదు’ అసెంబ్లీలో ఓ మంత్రి నిట్టూర్పు ఇది. సోమవారం ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరోవైపు సచివాలయంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. విగ్రహావిష్కరణ చేయాలని ఎప్పుడో నిర్ణయించగా, అసెంబ్లీ సమావేశాల ఆలోచన ఇటీవలే తెరమీదికి తెచ్చారని, హడావుడిగా నిర్వహించారని చర్చ జరుగుతున్నది. దీంతో కొం దరు మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేశారని సమాచారం. అధిష్ఠానం వద్ద తమ పరపతిని పెంచుకోవడానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఏమిటని వ్యతిరేకించినట్టు చెప్తున్నారు. అసెంబ్లీ లాబీలో చిట్‌చాట్ సందర్భంగా ఓ మం త్రి ఇదే విషయంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. సీఎంకు సలహాలు ఎవరిస్తున్నారో గానీ, ఒకేరోజు రెండు సభలు పెట్టుకోవడం, ఇంత హడావుడి పడటం ఎందు కు? అని అసహనం వ్యక్తంచేశారు.
అసెంబ్లీలో నిషేధాజ్ఞలు
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభలో గతం లో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు కొత్త నిబంధనలు అమలుచేస్తున్నారు. శాసనసభ ఆవరణలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధించారు. ఈ మేరకు శాసనసభ లాబీల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి నిన్నమొన్నటి వరకు శాసనసభ ఆవరణలో ఎవరైనా, ఎప్పుడైనా ఫొటోలు, వీడియోలు తీసుకునే వెసులుబాటు ఉం డేది. శాసనసభ సమావేశాలు జరుగుతు న్న సమయంలో టీవీ చానళ్లు లైవ్ ఇవ్వొద్దని చెప్పేవారు. ఫొటోలు, వీడియోలపై ఎలాంటి ఆంక్షలు లేవు. కొత్తగా ఈ సమావేశాల నుంచే నిబంధనలు తీసుకొచ్చారు. ప్రతిపక్షాలు చేపట్టే ఆందోళనల ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లకుండా ఉం డాలనే ఇలా చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.