వరంగల్ : ప్రభుత్వానికి కళ్లు, చెవులు ప్రభుత్వ అధికారులే. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ చేపట్టాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti), కొండా సురేఖ(Konda Surekha) అన్నారు. మంగళవారం ప్రజాపాలన(Praja palana)పై ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభల నిర్వహణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి. ప్రతి మండలంలో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకుకొని ప్రతి దరఖాస్తును స్వీకరించాలని పేర్కొన్నారు. ప్రతి దరఖాస్తు దారునికి 5 నిమిషాల నుంచి10 నిమిషాల సమయం కేటాయించాలి.
ప్రజా పాలన కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైందని, అధికారులు బాధ్యతాయితంగా పని చేయాలన్నారు. దరఖాస్తు దారునికి రూపాయి ఖర్చు లేకుండా చూడాలన్నారు. అలాగే తగిన్నన్ని కౌంటర్లు, ఏర్పాటు చేసి రశీదు అందజేయాలన్నారు. అనంతరం ప్రతి దరకాస్తు వివరాలు కంప్యూటర్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ జా, వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వన్ బాషా, తదితరులు పాల్గొన్నారు.