హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంలో మరో ముగ్గురు మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరుకుంది. మంత్రివర్గ కూర్పులో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమ ప్రాధాన్యం దక్కలేదు. కొన్ని జిల్లాలకు మూడేసి మంత్రి పదవులు దక్కితే, కొన్ని ఉమ్మడి జిల్లాలకు ఒక్క మంత్రి పదవి కూడా రాలేదు. ఖమ్మం జిల్లాకు మంత్రులు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆదివారం జరిగిన విస్తరణతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కినట్టు అయింది. ఇప్పటికే జిల్లా నుంచి మంథని శాసనసభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ మంత్రులుగా ఉన్నారు. తాజాగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు మంత్రి పదవి దక్కింది. ఇక వీటి తర్వాత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఇప్పటికే కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు.
తాజాగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి వరించింది. ఇక ఉమ్మడి వరంగల్ నుంచి సీతక్క, కొండ సురేఖ మంత్రులుగా ఉన్నారు. నల్లగొండ జిల్లా నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రులుగా ఉన్నారు. తాజా విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్‌కు స్థానం దక్కగా, ఆ జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఆయన వ్యవహరిస్తారు. ఇక కనీసం ఒక్క మంత్రి పదవి కూడా లేని ఉమ్మడి జిల్లాలుగా నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్లుంటాయి. ఈ మూడు ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్కరికి కూడా మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ తరహా రాజకీయ వివక్ష ఏనాడూ లేదని ఆయా జిల్లాల కాంగ్రెస్ నేతలే వాపోతున్నారు.
రాష్ట్ర చరిత్రలో మరో అరుదైన రికార్డు రేవంత్ సర్కారుకు దక్కుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక రాష్ట్రంలో కూడా 18 నెలలపాటు ముస్లి వర్గానికి మంత్రి పదవి లేకపోవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో సంఖ్యాపరంగా మైనార్టీల్లో ముస్లింలు అధికంగా ఉంటారు. ఈ వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తుంటారు. కానీ, ఈసారి ముస్లిం వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం దక్కలేదు.
మంత్రివర్గ విస్తరణ మళ్లీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. విస్తరణ జరిగినా మైనార్టీలకు స్థానం ఉంటుందో, లేదో కూడా స్పష్టత లేదు. ఇక, మైనార్టీలతోపాటు ఈసారి లంబాడా సామాజికవర్గానికి కూడా స్థానం కల్పించలేదు. రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడా వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలన్న తీవ్రమైన డిమాండ్ ఉన్నది. మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి ఆ వర్గానికి ఏదో చిన్న ఉపశమనం కల్పించామన్న భావనను కాంగ్రెస్ పార్టీ కల్పిస్తున్నది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 15 మంత్రి పదవులను భర్తీ చేశారు. ఇంకో మూడు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉన్నది. ఇప్పుడు ఆశావహులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఈ మూడు మంత్రి పదవులనే చూపిస్తున్నది. వీటిని భర్తీ చేసే ముందు మిమ్మల్నే పరిగణనలోకి తీసుకుంటామని చెప్తున్నది. అయితే, ఈమూడు మంత్రి పదవులనే 30 మంది ఆశావహులకు ఎరగా వేస్తుండడం గమనార్హం. మంత్రి పదవి అడుగుతున్న అందరికీ ఇంకో మూడు పదవులున్నాయి కదా, దాంట్లో మీకు ఒకటి గ్యారెంటీ అని చెప్పి బుజ్జగిస్తున్నది.