హైదరాబాద్, జూన్ 4 ( నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామాలు, వార్డుల్లోకి వెళ్లి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకొన్నారు. చేపట్టిన పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమ లక్ష్యాలను ప్రజలకు అవగాహన కల్పించి, స్థానిక సమస్యలను తెలుసుకొని పరిష్కరించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా జిల్లాల్లో పర్యటించిన మంత్రులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మల్‌లోని రాంరావుబాగ్, బుధవార్‌పేట్‌లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు. మురుగు కాల్వలు, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై ఆరా తీశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్‌లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్లలో పల్లెప్రగతి ర్యాలీలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొన్నారు.

కేంద్రం మాట వింటేనే నిధులట: ఎర్రబెల్లి
తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా అని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ తదితర పథకాలతో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని ఉద్ఘాటించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో క్రీడాప్రాంగణాన్ని, మానకొండూర్ మండలం లింగాపూర్‌లో సబ్‌స్టేషన్, మహిళా భవనాన్ని మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి ప్రారంభించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై అడుగడుగునా విషం చిమ్ముతున్నదని ఆరోపించారు. కేంద్రం చెప్పినట్టు వింటేనే రాష్ర్టానికి నిధులు ఇస్తారట?, ఇదెక్కడి న్యాయమని మండిపడ్డారు. 800 కోట్ల ఈజీఎస్ నిధులు ఆపారని, కూలీల పరిస్థితి ఏంటని ధ్వజమెత్తారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.
తెలంగాణపై కేంద్రం కక్ష : వినోద్‌కుమార్
‘తెలంగాణపై కేంద్రంలోని మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. అభివృద్ధి పనులకు నిధులివ్వడంలేదు.. వడ్ల కొనుగోళ్లపై కొర్రీలు పెడూతూ రైతాంగాన్ని ఆగం చేస్తున్నది’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా 150 కాలేజీలు మంజూరుచేస్తే తెలంగాణకు ఒక్కటికూడా ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో రూ.52 లక్షలతో నిర్మిస్తున్న సహకార సంఘ భవనానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం రూపురేఖలు మారాయన్నారు. మిషన్ కాకతీయతో భూమిపై పడ్డ ప్రతి వాన చుక్కను ఒడిసిపట్టడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకున్నదని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని.. కాళేశ్వరం, యాదాద్రి, భద్రాద్రి, పాలమూరు లాంటి భారీ ప్రాజెక్టుల కోసమే అప్పులు తెచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ దమ్ముంటే రాష్ర్టానికి నిధులు తేవాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్‌ను చూసి ఢిల్లీకి వణుకు : జగదీశ్‌రెడ్డి
దేశం మెచ్చిన నాయకుడు కేసీఆర్‌ను చూసి ఢిల్లీకి వణుకు పుడుతున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ దాటుతున్న సీఎం కేసీఆర్ వైపు దేశం చూస్తున్నదని, అందుకే ఢిల్లీని ఏలుతున్న పాలకులు భయపడుతున్నారని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ పేరు తో మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్.. తమ పాలనలోని రాష్ర్టాలకు అదే డిక్లరేషన్ వర్తింపజేయదా? అని ప్రశ్నించారు. అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రం అంటేనే తెలంగాణ అని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఒక్క హుజూర్నగర్ మండలం అమరవరం పంచాయతీలో జరిగిన అభివృద్ధి ముందు పెడితే 60 ఏండ్ల కాంగ్రెస్ పాలన ఎంతటిదో తేలిపోతుందన్నారు. రైతు బీమా కింద 34 మంది రైతు కుటుంబాలకు రూ.1.70 కోట్లు అందించామని స్పష్టంచేశారు. ఆసరా పింఛన్ల లెక్కలను ఆ పథకం లబ్ధిదారులే కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలిగించేలా చెప్పాలని సూచించారు. ఈ లెక్కల్లో అక్షరం తప్పున్నా దేనికైనా సిద్ధమని, కాదని రుజువు చేసే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? అని సవాల్ విసిరారు.
