Minister Harish Rao | సిద్దిపేట, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పోటీపడుతుంటే.. తిట్ల దండకం చదవటంలో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా ఉన్నదని.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచలో నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయకస్వామి బీఫార్మసీ కళాశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. సిద్దిపేటలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ..అనేక రంగాల్లో తెలంగాణ నేడు నంబర్ వన్ స్థానంలో ఉన్నదని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల తయారీలో నంబర్ వన్ అని ఉదహరించారు. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ జపం మాత్రమే చేశారని, కేసీఆర్ సీఎం అయ్యాక సమ్మిళిత అభివృద్ధికి కృషిచేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీతోపాటు గ్రామాల్లో వ్యవసాయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 3 లక్షల ఐటీ ఉద్యోగాలుంటే, నేడు 10 లక్షల ఐటీ ఉద్యోగాలకు తెలంగాణ నిలయంగా మారిందని పేర్కొన్నారు. దేశంలో అన్నిరంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవాచేశారు. కేంద్రప్రభుత్వం ఏ అవార్డు ప్రకటించినా అందులో తెలంగాణ పేరు ఉంటుందని చెప్పారు. శ్రీరంగనాయక ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా మరింత మంచి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో మాత్రమే జరిగే ఎగ్జిబిషన్లను ఇప్పటి నుంచి అన్ని జిల్లాల్లో నిర్వహించాలని నిర్ణయించామని చెప్పా రు. ఈ సొసైటీ మహిళల విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని కొనియాడారు. నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ప్రాంత ప్రజలు ముం దున్నారని, నేడు అభివృద్ధిలో కూడా ముందుటామని తెలిపారు.
త్వరలోనే మహిళా యునివర్సిటీ
రాష్ట్రంలో త్వరలోనే మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆడపిల్లల చదువుకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. కేజీ టు పీజీ విద్యను అమలుచేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. తొమ్మిదేండ్లలో వెయ్యి గురుకులాలు ఏర్పాటుచేసి అత్యంత నాణ్యమైన విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం 1,450 గురుకుల జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.